Begin typing your search above and press return to search.

టీమిండియాకు మరో రవీంద్ర జడేజా

By:  Tupaki Desk   |   25 July 2022 6:11 AM GMT
టీమిండియాకు మరో రవీంద్ర జడేజా
X
టార్గెట్ 312.. మరో 56 పరుగులు చేయాల్సి ఉండగానే స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ అందరూ ఔటైపోయారు. కొద్దో గొప్పో బ్యాటింగ్ చేయగలిగిన పేస్ ఆల్ రౌండర్ కూడా విఫలమయ్యాడు. ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మరో 32 పరుగులు చేయాల్సి ఉంది. టెయింలెండర్లతో కలిసి ప్రత్యర్థి పదునైన పేసర్లను ఎదుర్కొంటూ ఆ మాత్రం పరుగులు చేయడం.. కష్టమే. కానీ.. ఆ కుర్రాడు దానిని సాధ్యం చేశాడు. జట్టును గెలిపించాడు. తాను మరో రవీంద్ర జడేజాను కాబోతున్నట్లు చాటిచెప్పాడు. అతడే అక్షర్ పటేల్. వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో భారత జట్టును ఆల్ రౌండ్ ప్రదర్శనతో నెగ్గించాడు. తొలుత 9 ఓవర్లు వేసి 40 పరుగులు మాత్రమే ఓ వికెట్ పడగొట్టిన అక్షర్.. తర్వాత బ్యాటింగ్ అంతకన్నా మిన్నగా ప్రతిభ చూపాడు.

కేవలం 35 బంతుల్లోనే మూడు ఫోర్లు, 5 సిక్స్ లతో 64 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా.. నాలుగో బంతిని లాంగాఫ్ లోకి సిక్స్ గా మలిచి టీమిండియా సిరీస్ కైవసం చేసుకునేలా చేశాడు. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ జట్టు టీమ్‌ఇండియాకు గట్టి సవాలు విసిరింది. షై హోప్‌ (115) సెంచరీ బాదడంతో మొదట విండీస్‌ 6 వికెట్లకు 311 పరుగులు చేసింది.

అచ్చం జడేజాలానే..

28 ఏళ్ల అక్షర్ పటేల్ కు .. తన సీనియర్ రవీంద్ర జడేజాతో అనేక విషయాల్లో పోలికలున్నాయి. జడేజాలాగే ఇతడూ గుజరాత్ కు చెందినవాడే. ఎడమ చేతి వాటం స్పిన్నర్, బ్యాట్స్ మనే. జడేజా స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ నుంచి పూర్తి స్థాయి ఆల్ రౌండర్ గా మారినట్లే అక్షర్ కూడా స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ నుంచి పూర్తి స్థాయి ఆల్ రౌండర్ గా ఎదిగాడు. జడేజాలాగే టెస్టుల్లో సత్తా చాటి వన్డేలు, టి20ల్లో స్థానం సుస్థిరం చేసుకుంటున్నాడు.

ఈ విభాగాల్లో మెరుగైతే..

జడేజాలానే ఎదిగే సత్తా ఉన్న అక్షర్ పటేల్.. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించాలంటే చాలా మెరుగవ్వాల్సి ఉంది. ముఖ్యంగా జడేజా అద్భుత ఫీల్డర్. అక్షర్ కు ఫీల్గింగ్ లో పూర్ అనే పేరుంది. వికెట్ల మధ్య పరుగెత్తడంలో జడేజా చాలా చురుకు. అక్షర్ ఈ విషయంలోనూ ఎదగాల్సి ఉంది. శారరీరకంగా కాస్త సన్నగా ఉండే అక్షర్ బంతిని బలంగా మోదడంలో జడేజా కంటే వెనుకే.

అయితే, అతడి హిట్టింగ్ సామర్థ్యం ఈ మధ్య మరింత మెరుగైంది. ఇంకాస్త పదును పెరిగితే తిరుగుండదు. మరో ప్రధానం అంతం.. వేగంగా, వైవిధ్యంగా బంతులేయడంలో జడేజా ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. అక్షర్ కూడా ఆ విధమైన వేగం, వైవిధ్యం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫిట్ నెస్ లోనూ జడేజాకు తిరుగులేదు. బక్కపల్చటి అక్షర్ దీనిపై శ్రద్ధ చూపాలి. ప్రతిభావంతుడైన అతగాడికి ఇవేమీ అసాధ్యం కాదు.

నిలకడగా ఆడి.. గెలుపు బాటలో నడిపి

ఆదివారం రాత్రి మ్యాచ్ లో అక్షర్ నిలకడ భారత జట్టును గెలిపించడమే కాక.. సిరీస్ వశం చేసింది. 312 పరుగుల ఛేదనలో కెప్టెన్ ధావన్ (13) విఫలమైనా.. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 49 బంతుల్లో 43 (5 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 63, 4 ఫోర్లు, సిక్స్) ఆదుకోవడంతో టీమిండియా గెలుపు బాటలో పయనించింది. సూర్య కుమార్ (9) విఫలమైనా వికెట్ కీపర్ సంజూ శాంసన్ (51 బంతుల్లో 54, 3 ఫోర్లు, 3 సిక్స్ లు), దీపక్ హుడా (36 బంతుల్లో 33, 2 ఫోర్లు) రాణించడంతో విజయానికి చేరువగా వచ్చింది.

కానీ, విండీస్ బౌలర్లు పుంజుకుని వికెట్లు పడగొట్టారు. 256 పరుగుల వద్ద హుడా ఔటయ్యాడు. అయితే, అక్షర్ నిబ్బరంగా ఆడి గెలిపించాడు. ఈ క్రమంలో ఐదు సిక్స్ లు కొట్టాడు. వీటిలో కొన్ని చక్కటి షాట్లుండడం విశేషం. ముఖ్యంగా పేసర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో లాంగాన్ లోకి స్ట్రయిట్ బ్యాట్ తో కొట్టిన లాఫ్టెడ్ షాట్ సిక్స్ మ్యాచ్ కే హైలైట్. మేయర్స్ బౌలింగ్ లాంగాఫ్ లోకి కొట్టిన సిక్స్ తో మ్యాచ్ ను ముగించిన విధానమూ భేష్.