Begin typing your search above and press return to search.

శ్రీవారి భక్తులకు టీటీడీ సిద్ధం చేసిన మరో ‘ప్రసాదం’

By:  Tupaki Desk   |   2 Sep 2021 4:32 AM GMT
శ్రీవారి భక్తులకు టీటీడీ సిద్ధం చేసిన మరో ‘ప్రసాదం’
X
తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఈ థార్మిక సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో విమర్శలకు తెర తీస్తున్నాయి. ఈ మధ్యనే సంప్రదాయ భోజనం పేరుతో.. కాస్ట్ టు కాస్ట్ తో అందిస్తామని చెప్పటం.. దీనిపై విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి.. ఈ పథకాన్ని పక్కన పెట్టేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా సిద్ధం చేసిన ‘ప్రసాదం’ మాత్రం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఇంతకీ ఈ సరికొత్త ప్రసాదం ఏమంటే.. ‘ధన ప్రసాదం’.

అదేంటి ధన ప్రసాదం ఏమిటంటారా? మరింత వివరంగా చెప్పేస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతోంది. స్వామివారికి మొక్కులు చెల్లించేందుకు.. ఇతరత్రాలకు సంబంధించి చిల్లర నాణెల్ని స్వామి వారి హుండీలో వేస్తుంటారు భక్తులు. ఇవి కొండల తరహాలో పేరుకుపోతున్నాయి టీటీడీ దగ్గర. వాటిని తీసుకోవటానికి బ్యాంకులు ముందుకు రావటం లేదు. దీంతో.. ఈ చిల్లర కొండల్ని కరిగించేందుకు వీలుగా టీటీడీ కొత్త ఆలోచన చేసింది. రూపాయి నాణెలతో కూడిన రూ.వంద పాకెట్ ను సిద్ధం చేసింది. దానికి ‘శ్రీవారి ధన ప్రసాదం’ అంటూ అందమైన పాకెట్ గా రూపొందించింది.

తిరుమలకు వచ్చిన భక్తులు బస చేసే అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో చిల్లర నాణేలను 100 రూపాయల ప్యాకెట్ల రూపంలో ప్రత్యేక కవర్లలో భక్తులకు అందిస్తోంది. భక్తులు గదుల్ని అద్దెకు తీసుకొని.. చివర్లో తమ డిపాజిట్లను తిరిగి తీసుకునే సమయంలో ఈ పాకెట్లను నోట్లకు బదులుగా ఇస్తారు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసి.. తమకు నోట్లు మాత్రమే కావాలంటే నోట్లనే ఇస్తారు. మిగిలిన వారికి మాత్రం వారుకోరినన్ని పాకెట్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి రూపాయి నాణెలతో పాకెట్లు సిద్ధం చేశారు. రానున్న రోజుల్లో రూ.2.. రూ.5 నాణెలతో కూడిన పాకెట్లను సిద్ధం చేయనున్నారు.

ఒక అంచనా ప్రకారం రోజువారీగా స్వామి వారి హుండీలో రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు నాణెల రూపంలో కానుకలు వస్తున్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు వీలుగా ధన ప్రసాదం పేరుతో కొత్త ప్రసాదాన్ని భక్తులకు సిద్ధం చేసింది టీటీడీ. ఆలోచన బాగుంది కదూ. ఇలా అయినా.. చిల్లర నాణెల కొండల్నిటీటీడీ త్వరలోనే కరిగించే వీలుందన్న మాట వినిపిస్తోంది.