Begin typing your search above and press return to search.

సీఎం జగన్ చేతిలో మరో పదవి

By:  Tupaki Desk   |   29 Aug 2020 4:45 AM GMT
సీఎం జగన్ చేతిలో మరో పదవి
X
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో పదవిని చేపట్టారు. ఇప్పటికే ఆయన పలు మంత్రిత్వ శాఖల్ని చూస్తున్నారు. వీటితో పాటు.. మరో పదవిని చేపట్టటం గమనార్హం. తాజాగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవలప్ మెంట్ అథారిటీ బోర్డు.. ఎగ్గిక్యూటివ్ కమిటీలను ఏపీ సర్కారు ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్ గా సీఎం జగన్ నియమితులయ్యారు.

దీనికి ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి వివిధ శాఖలకు చెందిన పదకొండు మంది ముఖ్యకార్యదర్శుల్ని.. ఉన్నతాధికారుల్ని సభ్యులుగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల్ని మరింత ఎక్కువగా ఆకర్షించేందుకు ఈ అథారిటీ కీలకభూమిక పోషించనుంది. రాష్ట్రం పారిశ్రామికంగా మరింత ముందుకు వెళ్లేందుకు ఈ అథారిటీ ఉపయుక్తంగా మారనున్నట్లుగా చెబుతున్నారు.

ఎగ్జిక్యుటివ్ కమిటీ ఛైర్మన్ గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించారు. ఇప్పటికే పలు శాఖలతో పాటు.. సీఎం పదవితో తీరిక లేకుండా ఉన్న ముఖ్యమంత్రి.. మరో పదవిని చేపట్టారు. పాలనా పరమైన నిబంధనల్లో భాగంగానే ఈ పదవిని ముఖ్యమంత్రికి అప్పజెప్పినట్లు చెబుతున్నారు. సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు.. తాజాగా మరో పదవి దక్కినట్లైంది.