Begin typing your search above and press return to search.

విశాఖలో మరో పాజిటివ్... ఏపీలో మొత్తం 7 పాజిటివ్

By:  Tupaki Desk   |   24 March 2020 2:18 PM GMT
విశాఖలో మరో పాజిటివ్... ఏపీలో మొత్తం 7 పాజిటివ్
X
కరోనా మహమ్మారి ఏపీ ని కూడా అల్లాడిస్తోందనే చెప్పాలి. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ... ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో పాజిటివ్ కేసు నమోదవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జనాన్ని స్వీయ నిర్భందంలో ఉంచేలా ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతున్నా... ఆశించిన మేర ఫలితం రావట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు నమోదైన విశాఖపట్నం జిల్లాలో మంగళవారం మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో విశాఖలో పాజిటివ్ కేసులు మూడుకు చేరగా... రాష్ట్రంలో ఈ సంఖ్య 7కు చేరింది.

విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్వయంగా మంగళవారం విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాని... విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదైనట్లుగా వెల్లడించారు. విశాఖలో ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటికే ఈ జిల్లాలో 1470 మంది హోం క్వారంటైన్‌ లో ఉన్నారని చెప్పారు. వైరస్ వ్యాప్తి చర్యల్లో భాగంగా విశాఖలో 20 కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అన్ని రకాల చర్యలు, కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు.

అలాగే ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని నాని పిలుపునిచ్చారు. దయచేసి ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆయన ప్రజలకు విన్నవించారు. అలాగే మీ చుట్టుప్రక్క ఇళ్లకు విదేశీయులు ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఒకరి తప్పు వల్ల.. మొత్తం సమాజం హరించిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా.. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని నాని హెచ్చరించారు. ముఖ్యంగా కరోనా కట్టడిలో గ్రామ వాలంటీర్లదే కీలక పాత్రని, ఇందుకు సంబంధించి ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించాలని ఆయన సూచించారు.