Begin typing your search above and press return to search.

టీఆర్పీ స్కాంలో మరో జాతీయ చానెల్ పేరు తెరపైకి..?

By:  Tupaki Desk   |   9 Oct 2020 4:15 PM IST
టీఆర్పీ స్కాంలో మరో జాతీయ చానెల్ పేరు తెరపైకి..?
X
విద్యార్థులకు పరీక్షల ఫలితాల్లో రిజల్ట్ ఎలాగో.. టీవీ చానెల్స్ కు ఎంత మంది చూస్తున్నారో టీఆర్పీ రేటింగ్స్ అలా.. అయితే మార్కెట్లో నంబర్ 1 చానెల్ గా కొనసాగాలనే తపనతో కొన్ని చానెళ్లు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తాజాగా ముంబై పోలీసులు కనిపెట్టారు. ఈ టీఆర్పీ రేటింగ్ గుట్టు మట్లను ఛేధించారు.

నంబర్ 1 ర్యాంకు కోసం కొన్ని న్యూస్ చానెల్స్ తెరవెనుక టీఆర్పీ రేటింగ్స్ ను ప్రభావితం చేస్తున్నాయని ముంబై పోలీసులు గుర్తించారు. ప్రముఖ జాతీయ చానెల్ రిపబ్లిక్ టీవీతోపాటు.. మరో జాతీయ ఇండియా టుడే , ఇంకో న్యూస్ చానెల్స్ ఈ టీఆర్పీ స్కాంకు పాల్పడినట్టు ముంబై పోలీసులు గుర్తించారు.

గురువారం ఈ టీఆర్పీ స్కాంలో రిపబ్లిక్ టీవీ పేరు బాగా వినిపించగా.. శుక్రవారం మరో జాతీయ చానెల్ అయిన ‘ఇండియా టుడే’ పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఇండియా టుడేపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారని ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ నౌ పేర్కొంది. అయితే ఇండియా టుడే కానీ.. సాక్షులు కానీ దీన్ని ధ్రువీకరించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని.. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని ముంబై పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఆరోపణలపై రిపబ్లిక్ టీవీ మరో కథనం ప్రసారం చేసి కౌంటర్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఇండియా టుడేపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ముంబై పోలీస్ చీఫ్ ఎందుకు దర్యాప్తు నిలిపివేశారంటూ రిపబ్లిక్ టీవీ వాదిస్తోంది. ఇండియా టుడే పేరు టీఆర్పీ స్కాంలో ఉందని రిపబ్లిక్ టీవీ ఆరోపిస్తోంది.

ఇక టీఆర్పీ స్కాంలో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. విచారణకు శుక్రవారం సాయంత్రంలోగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

టీవీ రేటింగ్‌లను నిర్ణయించే బార్క్‌ తరఫున మీటర్ల మానిటరింగ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్న హంస అనే ఏజెన్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారని, హంస ఏజెన్సీలో పనిచేసి మానేసిన సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నామని ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ గురువారం మీడియాకు చెప్పారు. ఈ చానెళ్లు ముంబై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలో బార్క్‌ నెలకొల్పిన బేరోమీటర్లను టాంపరింగ్‌ చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా రుజువైందని సీపీ తెలిపారు. ఆ నివాసాల్లో ఉండేవారికి డబ్బులిచ్చి వారు తమ ఛానెల్‌నే నిరంతరం ఆన్‌చేసి ఉంచేలా రిపబ్లిక్‌ టీవీ, ఇతర మరాఠీ చానెళ్లు ఒప్పందానికి వచ్చాయని పేర్కొన్నారు.

అయితే అర్నబ్‌ గోస్వామి మాత్రం తమ ఛానెల్‌పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రిపబ్లిక్‌ టీవీని మహారాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం విమర్శించారు.