Begin typing your search above and press return to search.

సీమ ఎత్తిపోతలను అడ్డుకుంటాం: మంత్రి నిరంజన్ రెడ్డి

By:  Tupaki Desk   |   26 Jun 2021 11:00 PM IST
సీమ ఎత్తిపోతలను అడ్డుకుంటాం: మంత్రి నిరంజన్ రెడ్డి
X
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ‘నీటి’ యుద్ధం కొనసాగుతోంది. కృష్ణా జలాలపై వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాసగౌడ్ లు ఏపీ ప్రాజెక్టులు, నేతలపై దుమ్మెత్తిపోయగా.. తాజాగా వారికి మరో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి జతకలిశారు. ఏపీ ప్రభుత్వం, నేతలపై విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర అని.. తెలంగాణ నీటిని దోచుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు.

ఏపీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రా పాలకులు పట్టించుకోలేదని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఏపీ అవతరణతో మహబూబ్ నగర్ జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ఏపీ ప్రాజెక్టులు అక్రమమని.. తెలంగాణ నిర్మిస్తున్నవి సక్రమ ప్రాజెక్టులు అని అన్నారు.

విభజన చట్టం ప్రకారం.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం ద్వారా నీటి కేటాయింపులను జరిపించుకోవాలన్నారు. ముందు చూపుతో జోగులాంబ బ్యారేజ్ ను కేసీఆర్ ప్రతిపాదించారని చెప్పారు.

ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిది అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ వాటా సాధన కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నాడు జలదోపిడీకి సహకరించిన వారే నేడు కేసీార్ పై విమర్శలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.