Begin typing your search above and press return to search.
మరో భూకంపం.. పూర్తి వివరాలు!
By: Tupaki Desk | 12 May 2015 9:56 AM GMTనేపాల్ ను వణికించి, కుదిపేసిన భూకంపం మరువక ముందే మరోసారి నేపాల్ లో పుట్టిన భూకంపం... ఉత్తర భారత దేశాన్ని కూడా చిగురుటాకులా వణికించింది. ఉత్తరభారంలో దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9 కాగా, నేపాల్ వద్ద 7.4 గా నమోదైంది. నేపాల్ లోని ఢోలాక - సింధుపల్చోక్ మధ్య, కఠ్మాండు నుంచి తూర్పుదిశగా ఉన్న భిర్కోట్ కేంద్రంగా భూకంప వచ్చినట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేపాల్ తో పాటు బంగ్లాదేశ్, చైనా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో కూడా భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించింది.
సమయం, ప్రభావిత ప్రాంతలు:
సరిగ్గా ఆప్ఘనిస్తాన్‌లో 11:45, ఇండోనేషియాలో 11:57, నేపాల్లో 12:35 గంటలకు భూకంపం సంభవించింది. నేపాల్ లో భూమికి 19 కిలోమీటర్ల లోపల భూమి కంపించినట్లుగా అమెరికా భూగర్భ శాఖ చెబుతుంది. హిమాలయ పరివాహక ప్రాంతమంతా ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూమి కంపించడం మొదలుపెట్టగానే పెద్దగా కేకలు వేస్తూ కఠ్మాంటు ఎయిర్ పోర్టు నుంచి బయటకు పారిపోయారు. భూకంపం కారణంగా ఢిల్లీ, కోల్ కతా ల్లో మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి తీవ్రంగా ప్రకంపించిందని, అపార నష్టం సూచనలు ఉన్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ తెలిపింది. భారత్ లో ఢిల్లీ, బెంగాల్, బీహార్, రాజస్థాన్, పాట్నా, కోల్ కతా, పంజాబ్, లక్నో, జైపూర్ , ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లోని పలు ప్రాంతాల్లో సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించింది.
ఏపీలో ప్రభావం:
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు, విశాఖలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. స్వల్ప ప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం... విషయం తెలుసుకుని ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రతకి బీహార్ లో ఇద్దరు కార్మికులు మృతిచెందారని తెలుస్తుంది! పాట్నాలో మొబైల్ నెట్ వర్క్ స్థంబించడంతో సమాచార ప్రసారాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి!
ప్రధాని స్పందన, అఖిలేష్ పరుగులు:
ఈ భూకంపం పై ప్రధాని మోడి స్పందించారు. ముందు జాగ్రత్త చర్యలతో పాటు, ప్రమాదాలు జరిగిన చోట సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు! ఈ భూకంప తీవ్రత ఉత్తరప్రదేశ్ లో కూడా తీవ్రంగా కనిపించింది. ఆ సమయంలో లఖ్ నవూలో ఒక కార్యక్రమానికి హాజరైన ఊపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్... ఈ భూకంపం రావడంతో ఒక్కసారిగా ఆయనున్న భవనం నుండి పరుగులు తీశారు!
క్రికెటర్లను తాకింది:
ఇదే సందర్భంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈరోజు ఢిల్లీ డేర్ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనున్న రాయపూర్‌లోని స్టేడియంలో ఉన్న మాజీ శ్రీలంక ఆల్ రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్ భూకంప అనుభూతిని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. అలాగే చంఢీగడ్‌లో ఉన్న ఆస్టేలియా మాజీ క్రికెటర్ డామిన్ మార్టిన్ కూడా... నేపాల్ భూకంప ప్రభావం చండీగడ్‌లోని మా హోటల్‌పై కూడా పడిందని... అయితే అంతా క్షేమంగానే ఉన్నామని ట్వీట్ చేశాడు!