Begin typing your search above and press return to search.

స్మార్ట్ ఫోన్ వినాశనం.. మరో హెచ్చరిక

By:  Tupaki Desk   |   21 Aug 2019 4:50 AM GMT
స్మార్ట్ ఫోన్ వినాశనం.. మరో హెచ్చరిక
X
ఉదయం 8 గంటలకు రెడీ అయ్యి టిఫిన్ పట్టుకొని ఆఫీసులకు వెళ్తాం.. లేదా వారి వారి ఉద్యోగాల్లో బిజీ అవుతారు. సాయంత్రం వచ్చి టీ కాఫీ తాగి టీవీ చూసి బెడ్ పై వాలుతాం..కానీ పడుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో సెల్ ఫోన్లో మునిగిపోతాం. ఆ రోజున ఫేస్ బుక్ - వాట్సాప్ - ట్విట్టర్ అప్ డేట్స్ చూస్తూ కాలక్షేపం చేస్తాం.. మధ్యాహ్నం గంట భోజన విరామ సమయంలోనూ అంతే రెస్ట్ తీసుకోకుండా సెల్ ఫోన్ లో మునిగిపోతాం.. ఇదే ఇప్పుడు మీ కొంపలు ముంచుతుందని తాజాగా సర్వేలో తేలింది.

విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో సెల్ ఫోన్ వాడితే మీ పనితీరు తీవ్రంగా దెబ్బతింటుందని తాజాగా రట్గర్ వర్సిటీ పరిశోధకులు నిగ్గుతేల్చారు. రోజంతా తీరిక లేకుండా పని చేసి ఒత్తిడి తో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో సెల్ ఫోన్ వాడితే అది మీకు మానసిక ప్రశాంతత ఇవ్వకపోగా.. మెదడును మొద్దుబారేలా చేస్తోందని పరిశోధకులు తేల్చారు.

అమెరికాకు చెందిన రట్గర్ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 414 మంది విద్యార్థులకు ఓ పనిని అప్పగించారు. అనంతరం విరామం ఇచ్చారు. అందులో కొందరు రెస్ట్ తీసుకోకుండా స్మార్ట్ ఫోన్ లో మునిగితేలారు. కొందరు విరామమే తీసుకోలేదు. విరామం తీసుకోని వారికంటే కూడా స్మార్ట్ ఫోన్ వాడిన వారే అందరికంటే దారుణమైన ప్రదర్శన చేశారని పరిశోధకులు తేల్చారు. దీంతో విరామ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ స్మార్ట్ ఫోన్ వాడవద్దని.. అది మెదడును మొద్దుబారేలా చేసి పనితీరును దెబ్బతీస్తుందని పరిశోధకులు తేల్చారు. సో రెస్ట్ సమయంలో ఫోన్ ను పూర్తిగా పక్కనపడేస్తేనే మీ పనితీరు బాగుపడుతుందన్న మాట.. బీ అలెర్ట్.