Begin typing your search above and press return to search.

షాకింగ్.. నంద్యాలలో మరో ఫ్యామిలీ సెల్ఫీ వీడియో

By:  Tupaki Desk   |   11 Nov 2020 2:30 PM GMT
షాకింగ్.. నంద్యాలలో మరో ఫ్యామిలీ సెల్ఫీ వీడియో
X
మొన్నటికి మొన్న నంద్యాలకు చెందిన ఒక సగటు జీవి మీద దొంగతనం ఆరోపణలు చేయటం.. పోలీసుల ఒత్తిళ్లకు తట్టుకోలేక మానసిక వేదనతో కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. దీనిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక టీంను విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన కలకలం ఒక కొలిక్కి రాకముందే.. మరో సెల్ఫీ వీడియో తెర మీదకు రావటం సంచలనంగా మారింది.

ఈసారి మరో కుటుంబం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఇందులోని బాధితులు సైతం నంద్యాలకు చెందిన వారే కావటం.. వారు సైతం మైనార్టీలే కావటం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై ఆ కుటుంబం వారు ఆరోపణలు చేస్తున్నారు. నంద్యాలకు చెందిన మునాఫ్ నంద్యాలలో ఇంటింటికి వెళ్లి విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలలుగా అధికార పార్టీకి చెందిన నేతలు ఇతడి కాంట్రాక్టుల మీద కన్నేసి.. అతడికి దక్కకుండా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తాము వర్క్ టెండర్ వేస్తే.. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి తన అనుచరులకు ఆ పని ఇప్పించాలని.. తమకు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ను క్యాన్సిల్ చేయకుండానే వేరే వారికి ఇప్పించి రెండు నెలలుగా తమను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా వాపోయారు. తాము ఎవరికి వద్దకు వెళ్లినా ఏమీ చెప్పటం లేదని.. చివరకు హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా తమను అధికారులు పట్టించుకోవటం లేదన్నారు.

ఎమ్మెల్యే శిల్పా రవి చెప్పిన వారితోనే కాంట్రాక్టులు చేయిస్తున్నారని.. రూ.3లక్షలు పెట్టి తాము మిషన్లు తెచ్చుకొని ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తెలిపారు. తమకు న్యాయం చేయాలని.. లేకుంటే తమ కుటుంబం రోడ్డు మీద పడుతుందన్నారు. ‘ఎమ్మెల్యే చేసిన పనికి మా కుటుంబం రోడ్డు మీద పడుతోంది. ఒంగోలు నుంచి వచ్చిన మాధవరావుకు పని ఇప్పిస్తున్నాడు. నంద్యాలలోనే మేం ఉంటున్నాం. మా ఆధార్.. ఓటర్ కార్డు ఇక్కడే ఉన్నాయి. మేం నంద్యాలలో ఉండకూడదా? మేం వేరే ఊరు వెళ్లాలా? లేక చచ్చిపోవాలా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ వీడియోపై జగన్ విచారణకు ఆదేశిస్తే.. బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.