Begin typing your search above and press return to search.

కరోనా తెచ్చిన మరో కష్టం.. త్వరలో ప్రపంచానికి షాక్ తప్పదట

By:  Tupaki Desk   |   30 July 2022 10:38 AM IST
కరోనా తెచ్చిన మరో కష్టం.. త్వరలో ప్రపంచానికి షాక్ తప్పదట
X
యావత్ ప్రపంచానికి దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చింది కరోనా. అప్పటివరకు మాంచి ఊపు మీద దూసుకెళుతున్న ప్రపంచ గమనాన్ని ఒక్కసారిగా సడన్ బ్రేకులు వేసినట్లుగా ఆపేసిన వైనం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా.. యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఏకైక ఉదంతంగా కరోనాను చెప్పాలి.

కంటికి కనిపించని మహమ్మారిని అధిగమించేందుకు ప్రపంచ వ్యాప్తంగా మాస్కులు.. శానిటైజర్లు.. పీపీఈ కిట్లు ఇలా ఎన్నింటినో భారీగా వినియోగించారు. వాడేంతవరకు ఓకే. వాడేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడికి వెళ్లాయి? ఎలా ఉన్నాయి? అన్న విషయంలోకి వచ్చినప్పుడు అసలు ముప్పు మరొకటి పొంచి ఉందన్న విషయం అర్థమవుతుంది.

కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా.. ఆ ముప్పు నుంచి తప్పించుకోవటానికి వీలుగా వాడిన రక్షణ పరికరాలు మొత్తం భారీ వ్యర్థాలుగా మారాయి. వీటిల్లో చాలావరకు సముద్రంలోకి.. నదుల్లోకి.. చెరువుల్లోకి చేరి తీవ్రమైన పర్యవరణ సమస్యలకు కారణం కానున్నట్లు చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం సముద్రంలోకి చేరిన మాస్కులు.. పీపీఈ కిట్ల బరువు 25వేల టన్నుల వరకు ఉన్నట్లుచెబుతున్నారు.

వీటి పుణ్యమా అని.. జల వనరుల్లో ఉండే జీవజాలానికి ప్రమాదకరంగా మారుతున్నట్లుగా గుర్తించారు. 2019 డిసెంబరులో కరోనా మహమ్మారి చైనాలో బయటపడగా.. దాని పుణ్యమా అని ప్రపంచంలోని 193 దేశాలు దగ్గర దగ్గర 2021 ఆగస్టు వరకు కరోనా ఇబ్బందులతో తల్లడిల్లాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లుగా లెక్కలు వేస్తున్నారు. వీటిలో దాదాపు 70 వాతం జలవనరుల్లో చేరిపోయినట్లుగా చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని సురక్షితంగా నిర్వీర్యం చేసేందుకు సరైన సదుపాయాలు లేకపోవటమే ప్రధాన సమస్యగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు నెల వారీగా వాడేసిన మాస్కులు.. గ్లౌజుల లెక్కనే కళ్లు చెదిరేలా ఉందంటున్నారు.

ఒక అంచనా ప్రకారం నెల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 129 బిలియన్ల మాస్కులు.. 65 బిలియన్ల గ్లౌజులు వాడేసినట్లుగా చెబతున్నారు. ఇవన్నీ సింగిల్ యూజ్ కావటం.. వీటిని వాడిన తర్వాత వ్యర్థాలుగా మారటం.. వాటిని సరైన పద్దతిలో మేనేజ్ మెంట్ చేయకపోవటంతో కుప్పలు కుప్పలుగా మారాయి.

అన్నింటికి మించి ఒకసారి వాడి పారేసే మాస్కులు.. గ్లౌజులు ప్లాస్టిక్ తోనే తయారు చేయటం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఈ కరోనా వ్యర్థాలతో ప్రమాదం లేనప్పటికీ.. రానున్న కాలంలో మాత్రం దీని విపరిణమాలు ప్రపంచానికి తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే.. కరోనా వ్యర్థాల మీద ప్రత్యేక ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.