Begin typing your search above and press return to search.

ఊపిరాడక మరో ప్రాణం.. మరో దారుణం!

By:  Tupaki Desk   |   19 July 2020 5:13 AM GMT
ఊపిరాడక మరో ప్రాణం.. మరో దారుణం!
X
కరోనా వేళ ఏ ఉపద్రవం వచ్చినా వైద్యులు ఆ వైరస్ పై భయంతో చికిత్సలు చేయని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ లక్షణాలతో వచ్చిన ఓ యువకుడిని వార్డులో చేర్చి పట్టించుకోకపోవడంతో అతడు ఊపిరి ఆడక చనిపోయిన దైన్యం నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. తనయుడు కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లి అతడిపై పడి గుండెలు అవిసేలా ఏడ్వడం అందరినీ కంటతడి పెట్టించింది.

నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి కరోనా వైరస్ లక్షణాలతో మిర్యాలగూడ మండలం సల్కునూరుకు చెందిన ఓ యువకుడు తన తల్లి సాయంతో వచ్చాడు. వైద్యులు అతడి రక్త నమూనాలు తీసుకొని కరోనా వార్డులో చేర్చారు.

అయితే అప్పటి నుంచి అతడిని వైద్యులు గానీ.. నర్సులు గానీ అతడి వైపు రాలేదు. కొద్దిసేపటి తర్వాత నుంచి ఊపిరి ఆడక విలవిలలాడిన అతడు సాయంత్రానికి తన తల్లి కళ్లెదుటే కన్నుమూశాడు. కొడుకు మృతదేహం మీద పడి ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్వడం అందరినీ కలిచివేసింది. కాగా ఆస్పత్రిలో తమకు చికిత్స అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఏ ఒక్క డాక్టర్ రాలేదని.. నర్సులే మందులు ఇస్తున్నారని ఓ రోగి ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహాను వివరణ కోరగా.. ‘మేం ఎంతకని చేస్తాం.. మేం కూడా మనుషులమే’ అంటూ సమాధానం చెప్పడం గమనార్హం.