Begin typing your search above and press return to search.

అయ్యప్ప ఆలయం మాదే.. మరో వివాదం

By:  Tupaki Desk   |   6 Nov 2018 10:33 AM GMT
అయ్యప్ప ఆలయం మాదే.. మరో వివాదం
X
శబరిమల అయ్యప్ప దేవాలయంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. మొన్నీ మధ్యే అయ్యప్ప ఆలయంలోకి మహిళలను ప్రవేశించడానికి సుప్రీం కోర్టు అనుమతులు ఇచ్చింది. దీనిపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలను ఆలయంలోకి వెళ్లనీయడం లేదు. ఇప్పుడు కేరళలోని పురాతన మాల ఆర్యులు అయ్యప్ప ఆలయం తమదేనని.. తమ తరాల వారు 12 వ శతాబ్ధంలో నిర్మించారని.. తమకు అప్పగించాలని సుప్రీం కోర్టు గడప తొక్కేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా ఐక్యమాల ఆర్య మహాసభ వ్యవస్థాపన ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్ అయ్యప్ప ఆలయంపై విస్తృత పరిశోధనలు చేసి ఆ ఆలయాన్ని తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు.. ‘12 శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులు నిర్మించారని తమ పరిశోధనల్లో తేలిందని ’ ఆయన తెలిపారు. పండలం రాజకుటుంబం 1800లో దీన్ని ఆక్రమించిందన్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి అడవుల్లో విసిరేయగా.. వాటి స్థానంలో మాల ఆర్యులు కొత్తవి ప్రతిష్టించారని తెలిపారు. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్ లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారని ఆయన తెలిపారు. 1950లో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆలయ పాలన బాధ్యతలను స్వీకరించిందని తెలిపారు.

తమకు అయ్యప్ప ఆలయాన్ని అప్పగించాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరుతామని.. ఆ తర్వాత అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని మాల ఆర్యుల కార్యదర్శి సజీవ్ స్పష్టం చేశారు.

కాగా కేరళలోని వంద ఆలయాలపై ఆదివాసీ - దళిత సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. బ్రాహ్మణ పూజారులకు ముందు మాల ఆర్య పూజారులు ఉండేవారని.. వారు అయ్యప్పకు తేనాభిషేకం చేసేవారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 23న పట్టణంతిట్ట లో జరిగిన బహిరంగ సభలో ఈ వివాదానికి ఆజ్యం పోశాడు. దీంతో ఆర్య మాలలు ఇప్పుడు అయ్యప్ప ఆలయం పై హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టారు.