Begin typing your search above and press return to search.

భార‌త్ స‌రిహ‌ద్దుల‌కు ద‌గ్గ‌ర‌గా చైనా మ‌రో కుతంత్రం ఇదే!

By:  Tupaki Desk   |   21 July 2022 9:34 AM GMT
భార‌త్ స‌రిహ‌ద్దుల‌కు ద‌గ్గ‌ర‌గా చైనా మ‌రో కుతంత్రం ఇదే!
X
చైనా నోటితో చెప్పేదొక‌టి.. చేసేదొక‌టి. ఇది చాలాసార్లు రుజువైంది కూడా. భార‌త్ తో స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఓవైపు చ‌ర్చ‌లంటూనే.. మ‌రోవైపు భార‌త్ ను అన్ని వైపులా చుట్టుముడుతూ కుతంత్రాల‌కు పాల్ప‌డుతోంది. ఓవైపు చ‌ర్చ‌లు చేస్తూనే మ‌రోవైపు హ‌ద్దులు దాటి భార‌త్ ప‌రిధిలోకి చొచ్చుకు వ‌స్తోంది. జ‌మ్ముక‌శ్మీర్, ఉత్తరాఖండ్, ప‌శ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఇలా ఉత్త‌రం నుంచి ఈశాన్య దిక్కు వ‌ర‌కు భార‌త్ స‌రిహ‌ద్దుల్లోకి చొచ్చుకొస్తోంది.

ఇందుకోసం ఇప్ప‌టిదాకా లేని గ్రామాల‌ను సృష్టించ‌డంతోపాటు వివాదాస్ప‌ద ప్రాంతాల్లో రోడ్ల‌ను వేస్తోంది. ఈ రోడ్ల‌ను జాతీయ ర‌హ‌దార్ల‌కు అనుసంధానం చేస్తోంది. యుద్ధం సంభ‌విస్తే భార‌త్ స‌రిహ‌ద్దుల్లో ఏ మూల‌కైనా చొచ్చుకుపోయేలా సైన్యాన్ని చేర‌వేయ‌డానికి యుద్ధ ప్రాతిప‌దిక‌న గ్రామాల‌ను, రోడ్ల‌ను నిర్మిస్తోంది. కొద్ది రోజుల క్రితం సిక్కిం - భూటాన్ ల‌కు అతి సమీపంలో డోక్లాం వ‌ద్ద చైనా ఒక కొత్త గ్రామాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌జ‌ల‌తోపాటు సైనికులు ఉంటార‌ని తెలుస్తోంది.

ఇప్పుడు భారత్ - చైనా వివాదాస్పద ప్రాంతాలకు దగ్గరగా శ‌ర‌వేగంగా ర‌హ‌దార్ల‌ను నిర్మిస్తోంది. ప్రస్తుతం చైనా 1962లో ఆక్ర‌మించుకున్న అక్సాయ్ చిన్ గుండా ఒక కొత్త హైవేను నిర్మించాలని యోచిస్తున్నట్లు మీడియా క‌థ‌నాలు తెలుపుతున్నాయి.

ఈ హైవే భారతదేశ సరిహద్దు వెంబడి జింజియాంగ్‌ను టిబెట్‌తో కలుపుతుంద‌ని చెబుతున్నారు. వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా మ‌రో కొత్త ర‌హ‌దారిని చైనా నిర్మిస్తోంద‌ని అంటున్నారు. దీని ద్వారా భార‌త్ లోని ల‌డ‌ఖ్, ఆక్సాయ్ చిన్ ప్రాంతాల్లోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని త‌న ఆధీనంలోకి తీసుకుంటుంద‌ని పేర్కొంటున్నారు. ఇక ఈ కొత్త రహదారి 2035 నాటికి పూర్తవుతుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ కొత్త ర‌హ‌దారి రెండు దేశాల మ‌ధ్య ఉన్న వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ‌కు ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంద‌ని అంటున్నారు.

జ‌మ్ముక‌శ్మీర్ లో ఉన్న అక్సాయ్ చిన్ నుంచి భారతదేశం, నేపాల్, భూటాన్ సరిహ‌ద్దుల నుంచి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ర‌కు ఈ ర‌హ‌దారిని చైనా నిర్మిస్తోంద‌ని హాంగ్ కాంగ్ నుంచి వెలువ‌డే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

చైనా నిర్మించే రహదారి ఇటీవల భార‌త్-చైనాల మ‌ధ్య‌ ఉద్రిక్తతలకు కార‌ణ‌మైన‌ అనేక వివాదాస్పద ప్రాంతాలకు దగ్గరగా వెళ్తుంద‌ని అంటున్నారు. తూర్పు లడఖ్, డోక్లాం, దేప్సాంగ్ ప్లెయిన్స్, గాల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్ వంటి తీవ్ర వివాదాస్పద ప్రాంతాలకు సమీపంలోకి ఈ ర‌హ‌దారి రావచ్చు అని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌న‌దేశం ఎలా స్పందిస్తుద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు ఇండియా కూడా ఇప్ప‌టికే ఈశాన్య రాష్ట్రాల్లో భారీ ఎత్తున మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేస్తోంది. యుద్ధ విమానాలు కూడా దిగేలా జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం చేస్తోంది. ప్ర‌త్యేక సైన్య శిబిరాలు, ఆకాష్, త్రిశూల్, పృధ్వీ, బ్ర‌హ్మోస్ వంటి క్షిప‌ణుల‌ను స‌రిహద్దుల్లో మోహ‌రిస్తోంది.