Begin typing your search above and press return to search.

జగన్ కి మరో చాన్స్ : జనాలు కన్విన్స్ అవుతారా...?

By:  Tupaki Desk   |   10 Jun 2022 2:30 PM GMT
జగన్ కి మరో చాన్స్ : జనాలు కన్విన్స్ అవుతారా...?
X
వైసీపీలో కరడు కట్టిన వీరాభిమానుల నుంచి ఇపుడు బయటకు వస్తున్న మాట ఒకటి ఉంది. అదే జగన్ కి మరో చాన్స్. ఇది 2019 ఎన్నికల నినాదానికి పొడిగింపు అన్న మాట. జగన్ ఒక్క చాన్స్ అని నాడు అడిగితే జనాలు గంపగుత్తెడుగా ఓట్లను కుమ్మరించి భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. మరో రెండేళ్లలో జగన్ జమానా పూర్తి అయి ఎన్నికలు వస్తాయి. మరి ఈసారి నినాదం ఏంటి అంటే జగన్ కి మరో చాన్స్ అని.

దానికి కారణం ఏంటి అంటే జగన్ 2019లో సీఎం అయి తాను అనుకున్న వాటిలో కొన్ని మాత్రమే చేయగలిగారుట. అభివృద్ధి అన్నది ఆయన పెద్దగా చూపించలేకపోయారు. ఇక రెండేళ్లు మాత్రమే వ్యవధి ఉండడంతో అద్భుతాలు జరుగుతాయన్న ఆశలు అయితే ఎవరికీ లేవు. దానికి కారణం ఏంటి అంటే ప్రపంచమే అతి పెద్ద సంక్షోభంలో పడిపోయేలా కరోనా మహమ్మారి వచ్చిపడింది. ఇక ఏపీ లాంటి రాష్ట్రాలకు అది పెను శాపమే అని అంటున్నారు.

అప్పటికే అప్పులతో తప్పులతో ఆర్ధికంగా లోటుతో ఉన్న ఏపీకి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా కరోనా మహమ్మారితో ఇబ్బందులు వచ్చిపడ్డాయని అంటున్నారు. దాంతో మొత్తానికి మొత్తం పాలన గాడి తప్పిందని, జగన్ చేయాలనుకున్నవి ఎన్నో చేయలేకపోయారు అని వీరాభిమానులు చెబుతున్నారు. వైసీపీ నేతలు చాలా మంది కూడా అఫ్ ది రికార్డుగా చెప్పేది ఏంటి అంటే ప్రస్తుతం పాలన సాగుతున్న జగన్ మార్క్ చూపించడానికి తమకు ఏ కోశానా అవకాశం లేకపోయిందని.

అందుకే తమకు మరో చాన్స్ ఇస్తే కచ్చితంగా ఆ అయిదేళ్ళలో జగన్ అనుకున్నవి అన్నీ చేసి చూపిస్తారు అని అంటున్నారు. అయితే ఇది వినడానికి బాగానే ఉన్నా జనాలు కన్విన్స్ అవుతారా అన్నదే చర్చ. 2019లో జనాలు జగన్ కి అధికారం ఇచ్చినపుడు కరోనా అన్న మాటే ఎవరికీ తెలియదు, ఇక పాదయాత్రంలో జగన్ అనేక హామీలు ఇచ్చినపుడు కూడా కరోనా అన్న మహమ్మారి ఒకటి వస్తుందని, ఖజానా ఖాళీ అయి వెక్కిరిస్తుందని కూడా తెలియదు.

అందువల్లనే ఆయన చాలా బోల్డ్ గా హామీలు ఇచ్చుకుంటూ పోయారు అని అంటున్నారు. మరి కరోనా టోటల్ సీన్ ని మార్చేసింది కాబట్టి సంక్షేమం వరకూ ఓకే అనుకున్నా మిగిలినవి చేయలేకపోయామని అంటున్నారు. ఇదే మాటను రేపటి ఎన్నికల్లో ఊరూ వాడా తిరిగి జగన్ ఇదే మాటను చెబితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే చర్చ.

ఇక్కడ మరో మాట ఉంది. 2014 నుంచి 2019 టైమ్ లో చంద్రబాబు ఏలుబడి సాగింది. ఆయన నాలుగేళ్ళ పాటు కేంద్ర పెద్దలతో పొత్తులలో ఉన్నారు. ఇక చివరి ఏడాది మాత్రం వాటిని తెంచుకుని పాపం అంతా బీజేపీ మీద నెట్టి వారి వల్లనే ఏమీ చేయలేకపోయామని చెబితే జనాలు ఏ మాత్రం క్ష‌మించలేదు సరికదా ఓడించి పారేశారు.

అందువల్ల జనాల తీర్పు ఎపుడూ కఠినంగా ఉంటుంది. వైసీపీ వీరాభిమానుల ఆశలు ఉండవచ్చు కానీ ప్రజలు తాము కోరుతున్న తీరున పాలన సాగలేదు అనుకుంటే మాత్రం ఎవరినీ స్పేర్ చేయరు. అయితే జగన్ మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన కరోనా వల్లనే అన్ని ఇబ్బందులు అని చెప్పి జనాలను తన వైపుకు తిప్పుకుంటే మరో చాన్స్ దక్కుతుంది అని అంటున్నారు వైసీపీ నేతలు.

ఇంతకీ జగన్ జనాల్లోకి ఎపుడు వస్తారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. మూడేళ్ళ పాటు ఆయన జనలకు ముఖం చూపించలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక రాజకీయాల్లో తప్పు తమ వైపు ఉన్నా లేదు అని చెప్పుకునే తీరు ఉండాలి. జనాలకు ఉన్న విషయాలు ఒకటికి పదిసార్లు మెదడుకు ఎక్కేలా చూసుకోవాలి. జగన్ అయితే తక్కువ మాట్లాడుతారు, అన్నీ జనాలకు తెలుసు అనుకుంటారు. మరి అదే విధంగా తాను అంతా చేశాను అని ఆయన ఇప్పటికే అతి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి తాను అనుకున్న తీరున పెద్దగా ఏమీ చేయలేకపోయాను అని చెబుతారా అన్నది డౌటే. చెప్పినా జనాలు వింటారా అన్నది ఇంకా పెద్ద డౌటే.