Begin typing your search above and press return to search.

మోడీ బాదుడుకి మరో సెంచరీ.. సామాన్యుడికి మాత్రం షాక్

By:  Tupaki Desk   |   14 July 2021 3:19 AM GMT
మోడీ బాదుడుకి మరో సెంచరీ.. సామాన్యుడికి మాత్రం షాక్
X
వావ్ మోడీ.. గ్రేట్ మోడీ.. ఇదీ మోడీ అంటే.. ఇలా ప్రధానమంత్రి మోడీని పొగిడేసే వారే కాదు.. ఆయన తీరును తీవ్రంగా తప్పు పడుతున్నవారు.. ఆయన ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే వారు సైతం వ్యంగ్యంగా.. వావ్ మోడీ.. మీకే మీరే సాటి అంటూ కసి దీరా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. ఏడేళ్ల క్రితం ఏ మాత్రం ఊహించని రెండు అంశాలు వాస్తవాలుగా మారాయి. పెట్రోల్.. డీజిల్ రెండూ లీటరు వంద రూపాయిల వద్దకు చేరటానికి చాలానే సమయం పడుతుందన్న అంచనాల్ని పటాపంచలు చేయటం మోడీ మాష్టారికే చెల్లిందన్న మాట వినిపిస్తోంది.

ఈ మధ్యనే లీటరు పెట్రోల్ వంద రూపాయిల్ని దాటేసి.. అదే ఊపుతో వందకు మరో మూడు నుంచి ఐదు రూపాయిలు చేరుకోవటం తెలిసిందే. పెట్రోల్ ఇంత దూకుడుగా దూసుకెళుతుంటే.. తాను మాత్రం ఏమైనా తక్కువ తిన్నానా? అన్నట్లుగా డీజిల్ ధర సైతం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా లీటరు డీజిల్ వంద రూపాయిలకు చేరుకోవటం సగటు జీవిని ఆందోళనకు గురి చేస్తుంటే.. ప్రభుత్వాలు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు ధరలు పెరుగుతున్న కొద్దీ.. ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో.. ప్రజలు ధరల పెంపుపై హాహాకారాలు చేస్తున్నా.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కిమ్మనటం లేదు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల లేనప్పటికీ.. పెట్రోల్.. డీజిల్ ధరలు మాత్రం అందుకు భిన్నంగా పెరుగుతున్న తీరుపై విపక్షాలు ఆందోళన చేస్తున్నా.. కేంద్రం మాత్రం అస్సలు తగ్గట్లేదు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లీటర్ డీజిల్ ధర సెంచరీని కొట్టేసింది. ఏపీలో ఇప్పటికే లీటర్ డీజిల్ ధర రూ.వంద దాటేసింది. తెలంగాణలోనూ లీటర్ డీజిల్ ధర వందకు కాసిన్ని పైసలే దూరంగా ఉన్నాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటరు డీజిల్ రూ.97.78 ఉన్నప్పటికీ.. అదే సమయంలో కామారెడ్డిలో మాత్రం లీటరు డీజిల్ రూ.99.64గా నమోదైంది. అదిలాబాద్ జిల్లాలోనూ ఇంచుమించే అదే రేటు కంటిన్యూ అవుతోంది.

కేవలం ఏడాదిన్నర వ్యవధిలో లీటరు డీజిల్ కు పెరిగిన ధర ఏకంగా రూ.24 కంటే ఎక్కువ కావటం గమనార్హం. ఇప్పటికే ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. పెట్రోల్.. డీజిల్ ధరలు ఇంత భారీగా పెరిగిన వైనం సామాన్యుడికే కాదు.. మధ్యతరగతి జీవికి షాకిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఏడాదిన్నరలో లీటరు డీజిల్ రూ.24కు పెరిగితే.. ఏడేళ్లలో లీటరు డీజిల్ మీద రూ.40 వరకు పెరిగింది. అంటే.. మోడీ ప్రభుత్వం కొలువు తీరిన మొదటి ఐదున్నరేళ్లలో లీటరు డీజిల్ మీద రూ.16 మాత్రమే పెరిగితే.. కేవలం 18నెలల వ్యవధిలో లీటరుకు రూ.24 చొప్పున పెరగటం దేనికి సంకేతం?

పెరిగే పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నప్పటికి.. నోరెత్తకుండా ఉండేలా మోడీ భక్తులు.. దేశ భక్తితో ముడిపెడుతున్న వైనం కొత్తగా మారింది. ధరలు పెరిగిన సమయంలో ఆత్మరక్షణలో పడేందుకు బదులుగా.. కొత్త వాదనతో ఎదురుదాడి చేయటాన్ని పరిచయం చేసిన ఘనత మాత్రం మోడీ భక్తులకే చెల్లింది. బాదుడుకు కొత్త అర్థాన్ని దేశ ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ.. అదేమీ లేదు.. చరిత్రలో ఎప్పుడూ లేనంత తక్కువ పన్నులకే బతుకు బండి లాగే అద్భుత పాలనను పరిచయం చేసిన ఘనత తమదేనని బీజేపీ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తుండటం విశేషం. ఇలాంటి వాదనలు పెట్రోల్ బంకుల్లోని ధరలు మాత్రం సామాన్యుడికి షాకులు ఇస్తూనే ఉన్నాయి. పెట్రోల్.. డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. నోరు మెదిపే అవకాశం కూడా లేని పరిస్థితి. ఇలాంటి వేళలో.. నిరసనను చేపట్టలేం.. కనీసం బాదుడుకు ఉత్సవాల్ని చేయటం బెటరేమో?