Begin typing your search above and press return to search.

చింత‌మ‌నేని 67 నాటౌట్‌...!

By:  Tupaki Desk   |   22 Oct 2019 11:48 AM GMT
చింత‌మ‌నేని 67 నాటౌట్‌...!
X
చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ 67 నాటౌట్‌.. ఏమీటి ఈ లెక్క‌.. చింత‌మ‌నేని ఏమైనా క్రికెట్ ఆడుతున్నాడా.. ఆయ‌న ఇప్ప‌డు జైల్లో ఉన్నారు క‌దా.. ఓ జైల్లో ఏమైనా ఆట‌ల పోటీలు పెట్టారేమో.. ఆ పోటీల్లో భాగంగా ఆయ‌న క్రికెట్ ఆడాడా..అందులో చింత‌మ‌నేని చేసిన ప‌రుగులు కాబోలు అనుకుంటున్నారా ? అదేం కాదండి.. ఇవీ చింత‌మ‌నేనిపై న‌మోదైన కేసుల సంఖ్య‌. ఇప్ప‌టికి ఆయ‌న మీద కేసుల మీద కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి. ఈ కేసుల ప‌రంప‌ర‌లో ఇప్ప‌టికే 66 కేసులు న‌మోద‌వ్వ‌గా ఇప్పుడు తాజా కేసుతో క‌లుపుకుని మొత్తం 67 కేసులు న‌మోద‌య్యాయి.

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యం అక్క‌ర లేద‌నుకుంటా... చింత‌మ‌నేని ప్రభాక‌ర్ అంటే ఓ బ్రాండ్ అనేంతగా ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయారు. చేసుకున్నోళ్ల‌కు చేసుకున్నంత మ‌హాప్ర‌బో అన్న‌ట్లుగా ఇప్పుడు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అనుభ‌విస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు సీఎం చంద్ర‌బాబు అండ‌దండ చూసుకుని దెందులూరులో రెచ్చిపోయారు. ఓ మ‌హిళా ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడి చేసి స‌మ‌ర్థించుకోవడంతో పాటు ప్ర‌భుత్వ అధికారుల విధుల‌ను అడ్డుకోవ‌డం ఇలా చెప్పుకుంటూ పోతే అత‌డి దౌర్జ‌న్యాల‌కు అడ్డే లేదు.

టీడీపీ అధికారంలో ఉన్న‌ప్ప‌డు తాను ఆడింది ఆట‌.. పాడింది పాట‌.. త‌న‌కు ఎవ‌రు ఎదురు తిరిగినా ఇక అంతే సంగ‌తులు అన్న చందంగా మారింది ప్ర‌భాక‌ర్ వ్య‌వ‌హారం. టీడీపీ మ‌ళ్ళీ అధికారంలోకి వ‌స్తుంది.. మాకు ఎదురే లేదు అనుకుని రెచ్చిపోయిన ప్ర‌భాక‌ర్‌కు ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిందో చింత‌మనేనికి చిక్కులు మొద‌ల‌య్యాయి.. ఆయ‌న దెందులూరు ఎమ్మెల్యేగా చేసిన పాపాల‌ను వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్కొక్క‌రు పిటిష‌న్లు ఇవ్వ‌డం, సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుని వాటిని కేసులు న‌మోదు అయ్యేలా చూడ‌టం వ‌రుస‌గా జ‌రిగాయి.

ఇలా చింత‌మ‌నేనిపై ఇప్ప‌టికే 66 కేసులు న‌మోదు అయ్యాయి. అయితే 66వ కేసైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో చింత‌మ‌నేనికి ఏలూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరైనా విడుద‌ల‌కు ఇవ్వాల్సిన ష్యూరిటీల‌ను కోర్టుకు చింత‌మ‌నేని స‌మ‌ర్పించ‌డంలో విఫ‌లం అయ్యాడు. దీంతో కోర్టు ఈనెల 28వ వ‌ర‌కు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు రిమాండ్‌ కు విధించింది కోర్టు.. అయితే చింత‌మ‌నేని బెయిల్ వ‌చ్చిందో లేదో మ‌రో కేసు న‌మోదు అయింది. దీంతో మ‌రోమారు ఆయ‌న‌ను పోలీసులు ఆరెస్టు చేశారు. చింత‌మ‌నేని అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన దౌర్జ‌న్యాల‌ను టీడీపీ నేత చంద్ర‌బాబు ఆనాడు చూసి సహించారు. ఇప్పుడు మాత్రం చింత‌మ‌నేని వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు.