Begin typing your search above and press return to search.

మరో ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీనా?... లీట‌ర్‌ పెట్రోల్ రూ.150కి చేరిన‌ట్టే!

By:  Tupaki Desk   |   25 May 2021 3:29 PM GMT
మరో ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీనా?... లీట‌ర్‌ పెట్రోల్ రూ.150కి చేరిన‌ట్టే!
X
క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుత‌లం చేస్తోంది. తొలి వేవ్ కంటే కూడా అధిక సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న తీరు, దానికి మించి మ‌ర‌ణాల రేటు అమాంతంగా పెరుగుతున్న తీరు నిజంగానే దేశ ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. ఏదైనా విప‌త్తు వ‌చ్చిందంటే... ప్ర‌భుత్వాలు ఆదుకోక‌పోతాయా? అన్న దిశ‌గా జ‌నం ఆశ‌గా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న న‌రేంద్ర మోదీ సర్కారు క‌రోనా సెకండ్ వేవ్ ను క‌ట్ట‌డి చేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైన నేప‌థ్యంలో... ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఆస‌రా ల‌భించ‌ద‌న్న‌వాద‌న‌లు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా క‌రోనా తొలి వేవ్ నేప‌థ్యంలో జ‌నాన్ని ఆదుకుంటామంటూ ఏకంగా రూ.20 ల‌క్ష‌ల కోట్ల‌తో ప్ర‌క‌టించిన ఆత్మ‌నిర్భ‌ర ప్యాకేజీ అనుభ‌వాల‌ను త‌ర‌చి చూసుకుంటున్న జ‌నం... ఇప్పుడు మోదీ స‌ర్కారు ఉద్దేశ‌పూర్వ‌కంగా లీక్ చేసిన‌ట్టుగా భావిస్తున్న ఓ వార్త‌ను చూసి ఏకంగా భ‌య‌కంపితులే అవుతున్నారు.

క‌రోనా తొలి వేవ్ నేప‌థ్యంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్ద‌డంతో పాటుగా ఆర్థికంగా చితికిపోయిన ఆయా వ‌ర్గాల‌ను ఆదుకుంటామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఏకంగా రూ.20 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీని ప్ర‌క‌టించారు. ఈ ప్యాకేజీపై ఏకంగా ఐదు రోజుల పాటు ఊద‌ర‌గొట్టేసిన నిర్మ‌ల‌... చివ‌ర‌కు ఏ వ‌ర్గానికి ఏలాంటి ప్ర‌యోజ‌నం చేకూర్చార‌న్న విష‌యం జ‌నానికి చాలా త్వ‌రగానే తెలిసిపోయింది. ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీతో ఆదుకుంటామ‌ని చెప్పిన కేంద్రం... ఉచిత బియ్యాన్ని మాత్రం పంపిణీ చేసి ఆ త‌ర్వాత ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీకి కావాల్సిన నిధుల కోస‌మంటూ ప‌న్నుల మోత‌ను మోగించింది. వెర‌సి ప్ర‌తి వ‌స్తువు ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. వెర‌సి జ‌నాన్ని క‌రోనా ఆర్థికంగా కుంగ‌దీస్తే.. ఆదుకోవాల్సిన మోదీ స‌ర్కారు ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీ పేరిట జ‌నంపై ధ‌రాఘాతాన్ని ప్ర‌యోగించి మ‌రింత దుర్భ‌ర స్థితిలోకి నెట్టేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌రోనా తొలి వేవ్ మొద‌ల‌య్యే నాటికి లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.70గా ఉంటే... ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీ నిధుల కోస‌మంటూ కేంద్రం పెంచిన ప‌న్నుల ఫ‌లితంగా ఆ ధ‌ర కాస్తా రూ100కి చేరింది. ఏ ఒక్క వ‌ర్గానికి కూడా ఈ ప్యాకేజీ పెద్ద‌గా ఆదుకున్న దాఖ‌లా కూడా క‌నిపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీ మాదిరే మ‌రో ఆర్థిక ప్యాకేజీకి రూపక‌ల్ప‌న చేస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదేశాల‌తో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ ప్యాకేజీకి సంబంధించిన క‌స‌ర‌త్తులో ప‌డింద‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలే ఉద్దేశ‌పూర్వ‌కంగా మీడియాకు లీక్ చేశాయ‌న్న వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కే తెర లేసింది. ఆత్మ నిర్భ‌ర ప్యాకేజీతో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఏకంగా రూ.30 పెరిగితే... ఇప్పుడు ఆ ప్యాకేజీ మాదిరిగానే మ‌రో ప్యాకేజీ వ‌స్తే... ఇక లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఏకంగా రూ.150కు చేరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తొలి ప్యాకేజీకి సంబంధించి జ‌నంనుంచి పెద్ద‌గా వ్య‌తిరేక‌త రాని నేప‌థ్యంలో రెండో ప్యాకేజీని ఏ మేర పెంచి ప్ర‌క‌టించినా పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌ద‌ని కూడా కేంద్రం భావిస్తున్నట్లుగా స‌మాచారం. ఇదే జ‌రిగితే... తొలి ప్యాకేజీ కంటే కూడా ఇప్పుడు రానున్న ప్యాకేజీ మ‌రింత భారీత‌నంతో రానుంద‌ని, ఫ‌లితంగా ధ‌ర‌లు ఓ రేంజిలో పెరిగి దేశ ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మ‌రింత దిగ‌జార్చ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేపుతున్నాయి.