Begin typing your search above and press return to search.

రూ.10 లక్షల మార్క్ దాటిందా? నిఘా పడినట్లే

By:  Tupaki Desk   |   4 March 2017 4:20 AM GMT
రూ.10 లక్షల మార్క్ దాటిందా? నిఘా పడినట్లే
X
ఏ విషయం గుర్తున్నా లేకున్నా రూ.10లక్షలన్న మాట మాత్రం ఇకపై గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రూ.10లక్షల మాటను మరిచిపోతే కొత్త తిప్పలు మీద పడినట్లే. బ్యాంకు డిపాజిట్లు కావొచ్చు.. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు కావొచ్చు.. ఆస్తి లావాదేవీలు ఇలా ఏదైనా సరే రూ.10 లక్షల మార్క్ దాటితే.. ఆ సమాచారాన్ని బ్యాంకులు.. ఇతర ఆర్థిక సంస్థలే నేరుగా ఐటీ విభాగానికి సమాచారాన్ని అందించే కొత్త ఏర్పాటు ఒకటి తెరపైకి వచ్చింది.

ఇందుకు సంబంధించిన నిబంధనల్ని ఆయా సంస్థలకు పంపారు. గతంలో మాదిరి ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణికి చెక్ పెట్టేలా తాజా విధానం ఉందని చెప్పాలి. గతంలో ఎవరికైనా చేబదులు ఇవ్వటం.. ఆ తర్వాత తీసుకోవటం.. ఎవరికైనా ఏదైనా సాయం అవసరమైనప్పుడు.. మనకేమాత్రం సంబంధం లేకున్నా.. ఒకరి కోసం మరొకరిని సాయం అడిగి.. వారి నుంచి డబ్బులు తీసుకొని ఇచ్చే విధానాల విషయంలో ఇప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఈ విషయాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఒక ఆర్థికసంవత్సరంలో ఒక వ్యక్తికి చెందిన ఖాతాలో కానీ.. అతనికి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలన్నింటిని కలిపి రూ.10లక్షలు.. అంతకుమించిన జమ చేస్తే వాటికి సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. అయితే.. ఫిక్సెడ్ డిపాజిట్లు.. కరెంటు అకౌంట్ల విషయంలో ఈ విధానం అమలుకాదు. క్రెడిట్ కార్డు బిల్లు కింద రూ.లక్ష మొత్తాన్ని చెల్లించినా.. ఐటీశాఖ మూడో కన్ను పడినట్లే. క్రెడిట్ కార్డుల చెల్లింపుల కోసం రూ.10లక్షల మేర చెక్కులు ఇచ్చినా.. నగదుబదిలీ చేసినా.. ఐటీ దృష్టి మీ మీద పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్న నవంబరు 9 నుంచి డిసెంబరు30 లోపు వరకూ ఒక వ్యక్తికి చెందినఅన్నిబ్యాంకు ఖాతాల్లోరూ.2.5లక్షల కంటే ఎక్కువమొత్తాన్ని జమ చేసినా.. అదేసమయంలో కరెంటుఖాతాల్లో రూ.12.5లక్షలకు మించిన మొత్తం జమ అయినా ఐటీ ‘ఐ’ పడటం ఖాయమంటున్నారు.

కంపెనీలు.. ఆర్థిక సంస్థల విషయానికి వస్తే.. ఏ వ్యక్తి అయినా రూ.10లక్షల బాండ్లు.. డిపాజిట్లమొత్తాన్నికొనుగోలు చేసినా.. రూ.10లక్షలకు మించిన మ్యూచువల్ ఫండ్లు..బైబ్యాక్ షేర్లు తీసుకున్నా తిప్పలు తప్పనట్లే. ఇక.. ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే రూ.30లక్షలకు మించిన స్థిరాస్తిని కొనుగోలు చేసినా.. అమ్మినా.. ఆ వివరాల్ని నేరుగా ఆదాయపన్ను శాఖకు అందించే ఏర్పాటు మొదలైంది. ఇక.. రూ.10లక్షల ఫారిన్ కరెన్సీని కొనుగోలు చేసినా ఐటీ శాఖ మీ మీద నజర్ వేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/