Begin typing your search above and press return to search.

అన్నా రాంబాబు బూతు పురాణం.. సాయం అడిగిన వారిపై అనుచితంగా!

By:  Tupaki Desk   |   2 March 2020 6:45 AM GMT
అన్నా రాంబాబు బూతు పురాణం.. సాయం అడిగిన వారిపై అనుచితంగా!
X
పేరుకు భారీ మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యేనే కానీ, త‌న చేష్ట‌ల‌తో పూర్తిగా నెగిటివ్ ఇమేజ్ సంపాదించుకుంటున్నారు ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఇప్ప‌టికే ఈయ‌న తీరుపై గిద్దలూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. త‌మ‌నే మాత్రం ప‌ట్టించుకోకుండా క‌మిష‌న్లు బాగా ఇచ్చే తెలుగుదేశం వాళ్ల‌కు, త‌న మాజీ ప్ర‌జారాజ్యం స‌న్నిహితుల‌కే అన్నా రాంబాబు ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న వైనం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు అస‌హ‌నం తో ఉన్నారు. ఎన్నిక‌ల ముందు వైసీపీలోకి చేరి, జ‌గ‌న్ గాలిలో భారీ మెజారిటీ ని పొందిన ఎమ్మెల్యే గా ఈయ‌న నిలిచాడు. అది ఆయ‌న ఘ‌న‌త కాద‌ని, గిద్ద‌లూరు లో వైసీపీ కి బేస్ బ‌లంగా ఉండ‌టంతో..గెలిచార‌నేది జ‌నాభిప్రాయం.

అందుకు త‌గ్గ‌ట్టుగా అన్నా రాంబాబు అస‌హ‌నంతో ర‌గిలిపోతున్న‌ట్టుగా ఉన్నాడు. గిద్ద‌లూరు టౌన్లో ఇటీవ‌ల ప‌ర్య‌టించిన‌ప్పుడు ఒక సామాన్యుడిపై ఈ ఎమ్మెల్యే బూతుల దండ‌కాన్ని అందుకోవ‌డం వివాదంగా మారింది. త‌మ వ్య‌క్తి ఒక‌రు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఉన్నార‌ని, ఇప్ప‌టికే ఆరోగ్య శ్రీ తో కొంత ల‌బ్ధి క‌లిగిన‌ట్టుగా... అయినా స‌మ‌స్య తీర‌లేద‌ని, దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైనా సాయం క‌ల్పించాల‌ని ఒక సామాన్యుడు ఈ ఎమ్మెల్యేకు మొర‌పెట్టుకున్నాడు. త‌మ ఎమ్మెల్యే స‌మస్య‌లు విన‌డానికి వ‌చ్చాడ‌నుకుని స‌ద‌రు సామాన్యులు విన్న‌వించుకున్నాడు. అయితే అందుకు సానుకూలంగా స్పందించ‌డం సంగ‌తెలా ఉన్నా.. అన్నా రాంబాబు మాత్రం చాలా దారుణంగా వ్య‌వ‌హ‌రించాడు.

సాయం అడిగిన ఆ వ్య‌క్తిపై విరుచుకుప‌డ్డాడు. బూతు మాట‌ల‌తో అత‌డిని అవ‌మానించాడు. రాత‌ల్లో రాయ‌లేని, మాట‌ల్లో చెప్ప‌లేని బూతుల‌తో అన్నా రాంబాబు రెచ్చిపోవ‌డం గ‌మ‌నార్హం. సాయం అడిగిన వ్య‌క్తితో అనుచితంగా మాట్లాడి, బూతుల‌తో అత‌డిని అవ‌మానించాడు ఈ ఎమ్మెల్యే. ఈ విష‌యంలో స్థానికుల నుంచి అస‌హ‌నం వ్య‌క్తం అయ్యింది.

ఎమ్మెల్యే త‌న ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్న‌ప్పుడు.. మున్సిప‌ల్ అధికారులు, మ‌హిళ‌లు, ఇంకా జ‌న‌సామాన్యం అక్క‌డే ఉన్నారు. వారంద‌రి ముందే ఆయ‌న రెచ్చిపోయారు. సాయం అడిగిన వ్య‌క్తికి, ఆ సాయం చేసేది లేదంటూ.. తాము ఉన్న‌ది అందుకేనా అంటూ.. బూతుల‌తో ఎమ్మెల్యే రెచ్చిపోయాడు.

అయితే ఇది ఈయ‌న‌కు కొత్త కాదు! ఇది వ‌ర‌కూ కూడా ప‌లు సార్లు ఇలా మాట్లాడారు ఈ ఎమ్మెల్యే. రాజ‌కీయం కూడా వ్యాపార‌మే అని, తాము సంపాదించుకోవ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టుగా ఈయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టాడు ఇటీవ‌లే. పెళ్లం మెడ‌లోని పుస్తెలు అమ్ముకుని ప్ర‌జా సేవ‌కు రాలేద‌ని, దీన్ని కూడా ఒక వ్యాపారంగా భావించే తాము రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టుగా అన్నా రాంబాబు త‌న ఉద్ధేశాల‌ను అప్పుడే స్ప‌ష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా అదే రీతిన మాట్లాడారని గిద్ద‌లూరు ప్ర‌జ‌లు అనుకుంటున్నారు!