Begin typing your search above and press return to search.

ద్రవిడ భూమిలో ఆధ్యాత్మిక రాజకీయాలకు చోటెక్కడ.. రజనీపై అన్నాడీఎంకే సెటైర్లు

By:  Tupaki Desk   |   9 Dec 2020 10:30 AM IST
ద్రవిడ భూమిలో ఆధ్యాత్మిక రాజకీయాలకు చోటెక్కడ.. రజనీపై అన్నాడీఎంకే సెటైర్లు
X
అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తారని రజనీ ఇటీవలే ప్రకటించారు. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించనున్నారు. ఆ లోగా పెండింగ్ లో ఉన్న తన తాజా సినిమా అన్నాత్తే ను పూర్తి చేయనున్నారు. కాగా తాను రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాలను పూర్తిగా మార్చివేస్తానని, ఆధ్యాత్మిక రాజకీయాలను నడుపుతానని రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రజనీకాంత్ వ్యాఖ్యలపై తమిళనాట పెద్ద దుమారమే రేగుతోంది. ద్రావిడ సిద్ధాంతాలు జనాల్లో నాటుకుపోయిన తమిళనాడులో ఆధ్యాత్మిక రాజకీయాలు ఎలా చేస్తావు అంటూ పలువురు మండిపడుతున్నారు. అన్నా డీఎంకే డిప్యూటీ సమన్వయకర్త, ఎంపీ మునుస్వామి ఈ విషయమై రజనీకాంత్ ను తీవ్రంగా విమర్శించారు. పెరియార్ ఆశయాలకు అనుగుణంగా ద్రావిడ సిద్ధాంతాలను ఆనాటి ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్ రాష్ట్ర ప్రజలకు చేరువ చేశారని, ప్రజల మనసుల్లో కూడా ద్రావిడ సిద్ధాంతాలు బలంగా నాటుకు పోయాయన్నారు. ద్రావిడ భూమిలో ఆధ్యాత్మిక రాజకీయాలకు తావుండదని, అందుకు ప్రజలు కూడా అనుమతించరని ఆయన వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో సమూల మార్పును తీసుకొస్తానని ప్రకటించిన రజనీకాంత్ సర్వసాధారణమైన వ్యక్తేనని, ఆయన అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు కానే కాదన్నారు. రజనీ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తీసుకు వస్తారో ఎవరికీ అంతుపట్టడం లేదన్నారు. తానొక్కడే రాష్ట్రంలో నిజాయితీతో కూడిన పరిపాలన అందించగల సమర్థుడని రజనీకాంత్ గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందని విమర్శించారు. ఆయన సినిమాల్లో పెద్ద స్టార్ అయి ఉండొచ్చని, కానీ ప్రజల అభిమానం పొందిన రాజకీయ నాయకుడిగా పరిగణించలేమన్నారు. ఈ విషయంలో రజనీకాంత్ సర్వసాధారణమైన వ్యక్తేనని మునస్వామి విమర్శించారు. రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలు చేసినా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవించవని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ఐదు నెలల సమయం మాత్రమే ఉండగా.. రజనీకాంత్ తమిళ రాజకీయాల్లో ఎలా నెగ్గుకు వస్తారో చూడాల్సి ఉంది.