Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ పై ఈడీ కొరడా..నిర్వాహకుల అరెస్టు

By:  Tupaki Desk   |   18 Aug 2020 11:30 PM GMT
ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ పై ఈడీ కొరడా..నిర్వాహకుల అరెస్టు
X
దేశంలో పేకాట, ఇతర బెట్టింగులను కొన్నేళ్ల కిందటే నిషేధించారు. జూదం ఆడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జూదరులు తమ దృష్టి ఇప్పుడు ఆన్లైన్లో రమ్మీ, ఇతర బెట్టింగ్ లపై పెట్టారు. ఇలా ఆన్ లైన్లో జూదం నిర్వహించే చైనా యాప్స్ లెక్క లేనన్ని ఉన్నాయి. ఈ గేమ్స్ ఆడి బెట్టింగులు కట్టి రోడ్డున పడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. ఆన్ లైన్ రమ్మీ, బెట్టింగ్ సైట్లను నిషేధించాలని పలువురు విన్నవించడంతో ఇటీవల ప్రభుత్వం చైనా యాప్స్ ని నిషేధించింది. అయినా ఆన్ లైన్ జూదం యథేచ్ఛగా జరుగుతోంది. ఇటీవల సికింద్రాబాద్ కు చెందిన ఓ యువకుడు ఆన్ లైన్ జూదం ఆడి రూ. 97 వేలు పోగొట్టుకున్నాడు. కంచన్ బాగ్ కు చెందిన మరో వ్యక్తి ఆన్ లైన్ గేమ్ ఆడి రూ. 1.64 లక్షలు పోగొట్టుకున్నాడు.

వీరి ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. ఆన్ లైన్ లో యాప్స్, సైట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. ఇప్పటికే ఈ జూదం ద్వారా రూ. 1100 కోట్లు కొల్లగొట్టారని గుర్తించారు. దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ..'ముందు కొందరు దళారులు సోషల్ మీడియాలో అమాయకులను గుర్తించి ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ ద్వారా మంచి ఆదాయం వస్తుందని నమ్మిస్తారు. ఆ తర్వాత వారికి టెలిగ్రామ్ యాప్ ద్వారా గేమింగ్ లింక్స్ పంపుతారు. సైట్స్ నిర్వాహకులు దళారులకు కమీషన్ ఇస్తారు. జూద నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా తమ సైట్స్ ఏరోజు కారోజు కొత్తవి క్రియేట్ చేసుకుంటారు. ఈ సైట్లలో గేమ్స్, బెట్టింగ్ ఆడుతూ రూ. లక్షలు పోగుట్టుకుని రోడ్డున పడుతున్నారని' సీపీ తెలిపారు. ఆన్ లైన్ జూదంపై అందిన ఫిర్యాదు మేరకు రెండు కంపెనీల నిర్వాహకులను అరెస్టు చేశామని, ఇందులో కొందరు భారతీయ డైరెక్టర్లు కూడా వున్నారని, వీరంతా ఢిల్లీ కేంద్రంగా ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సీపీ చెప్పారు.