Begin typing your search above and press return to search.

దుబ్బాక : నోట్ల కట్టల కేసులో కీలక మలుపు!

By:  Tupaki Desk   |   27 Oct 2020 11:30 AM GMT
దుబ్బాక : నోట్ల కట్టల కేసులో కీలక మలుపు!
X
దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో నిన్న నోట్ల కట్టలు బయటపడడం సంచలనమైన సంగతి తెలిసిందే. సోమవారం రఘునందన్ బంధువైన సిద్దిపేటలోని సురభి అంజన్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 18 లక్షల నగదు బయటపడింది. ఆ డబ్బు ఎవరిదనే విషయంపై పీఠముడి నెలకొన్న వేళ అంజన్ రావు భార్య పోలీసుల ఎదుట కీలక విషయం ఒప్పుకున్నట్టు సమాచారం.

ఆ నోట్ల కట్టలు తమవే అని అంజన్ రావు భార్య అంగీకరించారని పోలీసులు తెలిపారు. తన బావమరిది నగదు ఇచ్చినట్టు అంజన్ రావు చెప్పారని పోలీసులు వెల్లడించారు.

పోలీసులే నగదు తీసుకొచ్చి అంజన్ రావు ఇంట్లో పెట్టారన్న బీజేపీ నేతల విమర్శలపై సీరియస్ అయిన సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తాజాగా సోదాల సమయంలో తీసిన వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో అంజన్ రావు, ఆయన భార్య సమక్షంలోనే పోలీసులు సోదాలు నిర్వహించి డబ్బులు సీజ్ చేసినట్టు వీడియోలో స్పష్టంగా ఉందన్నారు.

తాము అంజన్ రావు తోపాటు రఘునందన్ రావు ఇళ్లలో సోదాలు చేసేముందు నోటీసులు ఇచ్చామని.. ఆ తర్వాతే సోదాలు చేశామని సీపీ తెలిపారు. సోదాలు మొత్తం వీడియో చిత్రీకరించామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే నడుచుకున్నామన్నారు. పోలీసులే డబ్బు తీసుకొచ్చి పెట్టారన్నది అవాస్తవమని తేల్చిచెప్పారు.

సురభి అంజన్ రావు ఇంట్లో డబ్బులు దొరికాయని.. అధికారులు పంచనామా చేసి సీజ్ చేశారని.. ఇదంతా వీడియో రికార్డ్ చేశామని సీపీ తెలిపారు.