Begin typing your search above and press return to search.

అమ‌ర్‌ నాథ్ కుంపటి...అనీషాను వేధిస్తోందా?

By:  Tupaki Desk   |   11 Oct 2020 9:00 AM IST
అమ‌ర్‌ నాథ్ కుంపటి...అనీషాను వేధిస్తోందా?
X
రాజ‌కీయాల్లో కుటుంబాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న విష‌యం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు.. కుటుంబ స‌భ్యులే నేత‌ల త‌ల‌రాత‌ల‌ను నిర్ణ‌యిస్తున్నారు. ఇలాంటి వారిలో అనీషారెడ్డి ఒక‌రు. ఆమె మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో రెండు సార్లు విజ‌యం సాధించి.. త‌ర్వాత ప‌ల‌మ‌నేరుకు మారి.. వైసీపీ త‌ర‌ఫున కూడా విజ‌యం ద‌క్కించుకున్న ఎన్‌. అమ‌ర్‌ నాథ్‌ రెడ్డికి మేన‌కోడ‌లు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఈమెను అనూహ్యంగా తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై పుంగనూరు నియోజ‌క‌వ‌ర్గంలో పోటీకి పెట్టారు.

వాస్త‌వానికి పెద్దిరెడ్డి హ‌వా పుంగ‌నూరులో ఏ రేంజ్‌లో ఉందో ఎవ‌రికైనా తెలిసిందే. రాజ‌కీయాల్లో కొద్దిపాటి జ్ఞానం ఉన్న‌వారికి కూడా పెద్దిరెడ్డి పుంగ‌నూరులో ఎలా చ‌క్రం తిప్పుతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ, అనీషారెడ్డిని ఇక్క‌డ నిల‌బెట్టిన త‌ర్వాత‌..ఆమె గెలుపు విష‌యంలో పెద్దిరెడ్డి ఎలా అడ్డుప‌డ‌తారో తెలిసి కూడా అటు చంద్ర‌బాబు కానీ, ఇటు అమ‌ర్‌నాథ్‌రెడ్డికానీ జోక్యం చేసుకోలేదు. అయిన‌ప్ప‌టికీ.. అనీషా బాగానే ఖ‌ర్చు చేశారు. ఈ క్ర‌మంలో ఓ ప‌దెక‌రాల పొలాన్ని తెగ‌న‌మ్ముకున్న‌ట్టు ఆమె అనుచ‌రులు అప్ప‌ట్లోనే ప్ర‌చారం చేశారు. ఇది కూడా సింప‌తీగా మారుతుంద‌ని అనుకున్నారు కాబోలు!

కానీ, అనీషా రెడ్డి ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? న‌మ్ముకున్న మేన‌మామ‌.. హ్యాండిచ్చారు. పోనీ.. పార్టీలో అయినా గుర్తింపు ఉందా? అంటే అది కూడా లేదు. ఇటీవ‌ల రెండు కీల‌క నియామ‌కాలు జ‌రిగాయి. పార్ల‌మెంట‌రీ పార్టీ ఇంచార్జుల‌ను నియ‌మించారు. దానిలో అనీషారెడ్డికి చోటు ద‌క్క‌లేదు. మ‌హిళా పార్ల‌మెంట‌రీ నియామ‌కాలు జ‌రిగాయి దానిలోనూ అవ‌కాశం చిక్క‌లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అనేది అనీషారెడ్డికి ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అమ‌ర్‌నాథ్ రెడ్డి కూడా ఈ విష‌యంలో మౌనం పాటించారు. చంద్ర‌బాబు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు. వెర‌సి.. మేన‌మామ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఉన్న‌ది పోగొట్టుకున్నాన‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారట‌!! ఇదీ సంగ‌తి!!