Begin typing your search above and press return to search.

సీఎం జగన్ ను కలిసిన అనిల్ కుంబ్లే.. ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   5 July 2021 1:41 PM GMT
సీఎం జగన్ ను కలిసిన అనిల్ కుంబ్లే.. ఎందుకంటే..?
X
భార‌త క్రికెట్‌ జ‌ట్టు మాజీ కెప్టెన్, దిగ్గ‌జ లెగ్ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ క్రీడాభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, క్రీడా సామ‌గ్రి త‌యారీకి సంబంధించిన ఫ్యాక్ట‌రీ ఏర్పాటుపై వీరిద్ద‌రూ చ‌ర్చించారు. ఈ రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను అనిల్ కుంబ్లే కోరిన‌ట్టుగా తెలుస్తోంది. క్రీడా యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల క్రీడాకారుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని కుంబ్లే చెప్పారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టాల‌ని, ఇందుకు త‌న వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని అనిల్ కుంబ్లే చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

దేశంలో క్రీడాకారుల‌కు అవ‌స‌ర‌మైన క్రీడా సామ‌గ్రిని త‌యారు చేసే ఫ్యాక్టీరీలు జ‌లంధ‌ర్‌, మీరట్ వంటి ప్రాంతాల్లో మాత్ర‌మే ఉన్నాయ‌ని కుంబ్లే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందువ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా క్రీడా సామ‌గ్రి త‌యారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంద‌ని అనిల్ కుంబ్లే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు వివ‌రించారు. ఈ విష‌యాన్ని వైసీపీ విభాగం సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

కాగా.. టీమిండియాకు అనిల్ కుంబ్లే ఎంత‌టి సేవ‌లు అందించారో తెలిసిందే. దిగ్గ‌జ లెగ్ స్పిన్న‌ర్ గా ఎంతో కాలంపాటు కొన‌సాగిన కుంబ్లే.. ఒంటిచేత్తో అద్వితీయ‌మైన విజ‌యాల‌ను అందించారు. పాకిస్తాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో ప‌ది వికెట్ల‌ను ఒక్క‌డే కూల‌దోసి.. ప్ర‌పంచ రికార్డు స‌మం చేశాడు. ఇక‌, భార‌త జ‌ట్టు కోచ్ గా కూడా కొంత కాలం ప‌నిచేశారు అనిల్ కుంబ్లే.