Begin typing your search above and press return to search.

లోకేష్ పై కొత్త దాడి.. కోలుకుంటాడా?

By:  Tupaki Desk   |   12 July 2019 5:23 AM GMT
లోకేష్ పై కొత్త దాడి.. కోలుకుంటాడా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ సెటైర్ లతో సోషల్ మీడియాలో అభాసుపాలైన నేత ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ బాబే అని చెప్పకతప్పదు. లోకేష్ భాష లోపం - నాయకత్వ లోపం.. దొర్లిన తప్పులపై సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వులు పూయించేలా చేసిన మీమ్స్ - పోస్టులు అన్నీ ఇన్నీ కావు..

ఓ వైపు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నాయకత్వంలో తండ్రికి తలదన్నేలా ఎదుగుతుంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేని స్థితిలో లోకేష్ బాబు ఇప్పుడు అందరికీ టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు ఘోర ఓటమితో టీడీపీని వీడుతున్న నాయకులు కూడా లోకేష్ వల్లే పార్టీ దుస్థితి ఇదీ అని ఆడిపోసుకుంటున్నారు.

చంద్రబాబు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలను లోకేష్ కు అప్పగిద్దామని అనుకుంటుంటే టీడీపీని వీడిన రాజ్యసభ సభ్యులు - కాపు నేతలు - ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ కూడా లోకేష్ వల్లే పార్టీ ఓడిందని విమర్శలు గుప్పించారు.

అయితే లోకేష్ బాబు ఇప్పుడు ట్విట్టర్ కేంద్రంగా వైఎస్ జగన్ పై - ప్రభుత్వంపై సంధిస్తున్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. పదునైన ఈ విమర్శనాస్త్రాలు లోకేష్ చేయడం లేదని.. ఎవరో భాషా ప్రముఖులతోనే రాయించి తన ఖాతాలో వేసుకుంటున్నాడని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. అయితే ట్విట్టర్ గూట్లోనే కాదు.. బయట కొచ్చి అలా మాట్లాడే ధైర్యం దమ్ము ఉందా అని కౌంటర్ ఇచ్చారు. ఇటు టీడీపీలోనూ ట్వీట్సేనా బయటకొచ్చి లోకేష్ పోరాడుతారా అన్న చర్చ సాగుతోంది. దీంతో లోకేష్ బాబు బయటకొచ్చి తన మాటల తూటాలు పేల్చగల అవశ్యకత ఏర్పడింది. మరి ట్విట్టర్ గూటిని వీడి లోకేష్ బయటకు వస్తారా? తనను తాను నిరూపించుకుంటారా అన్నది వేచిచూడాలి.