Begin typing your search above and press return to search.

రాఫెల్ డీల్.. అనిల్ దోషే... కేంద్రంపై బాంబు!

By:  Tupaki Desk   |   13 April 2019 11:07 AM GMT
రాఫెల్ డీల్.. అనిల్ దోషే... కేంద్రంపై బాంబు!
X
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వ్యవహారం ఇప్పటికే బీజేపీని తీవ్రంగా విమర్శల పాలు చేసింది. ఈ వ్యవహారంలో అనిల్ అంబానీకి మేలు చేసేలా కాంట్రాక్టును ప్రధాని మోడీ ఇప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా రాఫెల్ యుద్ధవిమానాలు తయారయ్యే ఫ్రాన్స్ దేశంలో ఓ జాతీయ పత్రిక అనిల్ అంబానీపై మరో బాంబు లాంటి సంచలన కథనాన్ని ప్రచురించింది. రాఫెల్ ఒప్పందంతో అనుసంధానమైన మరో అంశాన్ని వెలికి తీసి అనిల్ అంబానీ మెడకు ఉచ్చు బిగిసేలా చేసింది ఫ్రాన్స్ జాతీయ దినపత్రిక ‘లెమాండే..’

అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ ‘రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్’ ఫ్రాన్స్ దేశంలోనూ టెలికాం సేవలు అందిస్తోంది. అయితే ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్ తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నాక.. కొద్ది నెలల్లోనే అనిల్ అంబానీ తన టెలికాం కంపెనీ చెల్లించాల్సిన 143.7 మిలియన్ యూరోలను ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారని సంచలన కథనాన్ని ఫ్రాన్స్ పత్రిక ప్రచురించింది.

భారత్- దస్సో కంపెనీల మధ్య రాఫెల్ ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో అక్టోబర్ 2015లోనే ఈ మాఫీ జరిగినల్లు కథనంలో పేర్కొంది. ఏప్రిల్ 2015లో మోడీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలోనే భారత్ 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.

2007-10 వరకు అనిల్ అంబానీ టెలికాం కంపెనీ ఫ్రాన్స్ ప్రభుత్వానికి 60 మిలియన్ యూరోలను ట్యాక్స్ కట్టాల్సి ఉందని ఫ్రాన్స్ అధికారులు గుర్తించారు. అయితే రిలయన్స్ కంపెనీ మాత్రం 7.6 మిలియన్ యూరోలు మాత్రమే చెల్లించగలమని అధికారులకు తెలిపింది. అయితే ఫ్రాన్స్ అధికారులు దీనికి ఒప్పుకోలేదు. 2015లో ప్రధాని రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సంబంధించి అంబానీ కంపెనీ 151 మిలియన్ యూరోలు పన్ను రూపంలో ఫ్రాన్స్ ప్రభుత్వానికి కట్టాల్సి ఉండేది. అయితే ప్రధాని మోడీ రాఫెల్ ఒప్పందం చేసుకున్న 6 నెలల తర్వాత ఫ్రాన్స్ ఇన్ కంటాక్స్ శాఖ అనిల్ అంబానీ టెలికాం కంపెనీ కట్టాల్సిన 143.7 మిలియన్ల పన్నును మాఫీ చేసిందని కథనంలో పేర్కొంది. తొలుత అనిల్ అంబానీ చెల్లిస్తామన్న 7.3 మిలియన్ యూరోలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. దీన్ని బట్టి రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీ పాత్ర ఉందని.. మోడీ రాఫెల్ కుంభకోణంలో అనిల్ కు లబ్ధి చేకూర్చారని కన్ఫం అయ్యింది..