Begin typing your search above and press return to search.

రెచ్చిపోతున్న పంజాబీ గ్యాంగ్ స్టర్లు.. సల్మాన్ లాయర్ ను చంపేస్తారట.?

By:  Tupaki Desk   |   7 July 2022 8:00 AM IST
రెచ్చిపోతున్న పంజాబీ గ్యాంగ్ స్టర్లు.. సల్మాన్ లాయర్ ను చంపేస్తారట.?
X
పంజాబ్ మూలాలున్న గ్యాంగ్ స్టర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రముఖ పంజాబీ గాయకుడు మూసేవాలాను చంపిన ఈ ముఠా సభ్యులు తాజాగా సల్మాన్ ఖాన్ లాయర్ ను చంపుతామంటూ బెదిరింపు లేఖలు విడుదల చేయడం సంచలనమైంది. ఇప్పటికే నెలకిందట కూడా సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లను చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై సల్మాన్ బాంద్రా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.

పంజాబీ సింగ్ సిద్దూ మూసేవాలా హత్య కేసు ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతీకార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన అన్నని మట్టుబెట్టినందుకు ప్రతీకారంగానే సిద్దూను తన ముఠాసభ్యులు చంపినట్లు ఒప్పుకున్నాడు.

దీనికి కెనడా గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ సహకరించినట్టు తేలింది.  మూసేవాలా హత్యకు సూత్రధారిగా గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు తేల్చారు.ఇప్పటికే బిష్ణోయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతవారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు.ఇక బిష్ణోయ్ తనతోపాటు గన్ ఫైరింగ్ లో పాల్గొన్న వారి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాడు. ఈ కేసులో ఇప్పటివరకూ 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. జోధ్ పూర్ కోర్టులో తన చాంబర్ బయట ఈ లేఖ లభించింది. లేఖలో ‘గాయకుడు మూసేవాలకు పట్టిన గతే నీకు పడుతుంది.. మేం ఎవరినీ వదలం.. మీ కుటుంబ సభ్యులను విడిచిపెట్టం’ అని రాసి ఉంది.

ప్రస్తుతం సల్మాన్ వేటాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణ జింక కేసులో జోధ్ పూర్ హైకోర్టులో లాయర్ హస్తిమల్ సల్మాన్ తరుఫు వాదిస్తున్నారు. అందుకే హస్తిమల్ ను బెదిరించినట్టు తెలిసింది. జోధ్ పూర్ రైల్వే స్టేషన్ లో లాయర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి లాయర్ కు భద్రత పెంచి విచారణ జరుపుతున్నారు. ఈ లేఖ చివరలో ఎల్.బీ , జీబీ ఉండడంతో ఇది గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ల పని అని పోలీసులు అనుమానిస్తున్నారు.