Begin typing your search above and press return to search.

బాబుకు అంగన్‌వాడీల సెగ

By:  Tupaki Desk   |   17 March 2015 12:18 PM IST
బాబుకు అంగన్‌వాడీల సెగ
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో అంగన్‌వాడీలకు జీతాల పెంపు ప్రభావం ఏపీలో కదలికను తీసుకొచ్చింది. అంగన్‌వాడీలకు ఇచ్చే జీతాలు తక్కువన్న విషయాన్ని తెలంగాణ సర్కారు గుర్తించినప్పటికీ.. ఏపీ సర్కారు మాత్రం పట్టించుకోవటం లేదంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రోజా విరుచుకుపడుతున్నారు.

అంగన్‌వాడీల సమస్యలపై రోజా గళం విప్పటంతో ఏర్పడిన గందరగోళంతో ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. అంగన్‌వాడీల బాధల్ని.. కష్టాల్ని పక్కరాష్ట్రాల వారు అర్థం చేసుకున్నా.. చంద్రబాబు అర్థం చేసుకోవటం లేదని రోజా మండిపడుతున్నారు.

తమ బాధల్ని సీఎంతో చెప్పుకుందామని వచ్చిన అంగన్‌వాడీలపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు.. కమ్యూనిస్టు నేతల అధ్వర్యంలో హైదరాబాద్‌ వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు పోలీసుల కళ్లు గప్పి ఇందిరాపార్కుకు చేరుకున్నారు.

అక్కడ నుంచి ప్రదర్శనగా అసెంబ్లీకి వెళతారన్న వార్తల నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ వ్యవహారం చివరకు ఎక్కడి వరకూ వెళుతుందో అని అధికారపక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు. అందరికి అన్ని వరాలు ఇస్తున్న బాబు.. అంగన్‌వాడీల విషయంలో వదిలేయటం ఎందుకు? వారి కోర్కెల్ని తీరుస్తానని హామీ ఇచ్చేస్తే పోలా..? లోటులో లోటు కలిసిపోతుంది.