Begin typing your search above and press return to search.

పయ్యావుల శిబిరంలో పండగే పండగ!

By:  Tupaki Desk   |   18 Oct 2017 2:01 PM GMT
పయ్యావుల శిబిరంలో పండగే పండగ!
X
రాజకీయ పార్టీల నుంచి నాయకులు బయటకు వెళ్లిపోవడం చరిత్రలో కొత్త విషయం కాదు. పైగా నేడో రేపో దుకాన్ బంద్ అనే అభిప్రాయం కలిగిస్తున్న పార్టీలో నాయకులు ఎంత ఎక్కువకాలం కొనసాగితే.. అది అంతగా వారి అమాయకత్వం అన్నట్లుగా ఇవాళ్టి పరిస్థితులు తయారవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ తెలుగుదేశం నుంచి ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పంచన చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉండడం వింత కాదు.

అయితే తాను రాజకీయాల్లో నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వాడినని, తనంత అనుభజ్ఞుడు అసలు దేశంలోనే లేరని సొంత డప్పు కొట్టుకుంటూ ఉండే చంద్రబాబునాయుడు.. తెలంగాణ తెలుగుదేశం విషయంలో ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరించారు. అక్కడ నాయకులు పార్టీని వీడిపోబోతున్నారని తనకు ముందే తెలిసినప్పటికీ.. అందుకు నెపం పయ్యావుల కేశవ్ లాంటి వారి మీద నెట్టేయడానికి ప్రయత్నించారు. ఇది చాలా చీప్ ట్రిక్ గా పార్టీలోనే పలువురు దెప్పి పొడుస్తున్నారు.

పెళ్లికి వచ్చిన అతిథితో యాదృచ్ఛికంగా కొద్దిసేపు గడిపినందుకు పయ్యావుల వంటి సీనియర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఎలా అంటూ చంద్రబాబునాయుడు కసురుకున్న సంగతి అందరికీ గుర్తే. అయితే తాజాగా పార్టీనుంచి వెళ్లిపోదలచుకుంటున్న రేవంత్ రెడ్డి వెల్లడిస్తున్న సంగతుల్ని బట్టి.. ఆయనకు అసంతృప్తి కలగడానికి కారణం పయ్యావుల కాదని, ఏపీలోని యనమల రామకృష్ణుడు వంటి నాయకులు కేసీఆర్ తో అంటకాగుతూ.. కాంట్రాక్టులు దక్కించుకుంటున్న వైనమే అని తెలుస్తున్నది. ఏపీ తెదేపా నాయకులు కేసీఆర్ తో మిలాఖత్ అయితే కాంట్రాక్టుల రూపేణా డబ్బు దండుకుంటూ ఉంటే తెలంగాణ లో ప్రభుత్వం మీద తమ పోరాటానికి విలువ ఏం ఉంటుందనేది ప్రధానంగా రేవంత్ ప్రశ్న. అటే కేశవ్ పెళ్లిలో భేటీ ఈ పోకలకు ఎలాంటి కారణం కాదని తేలిపోతోంది. దీంతో పయ్యావుల కేశవ్ అభిమానులు - ఆయన శిబిరంలో తాజాగా ఆనందం తొణికిసలాడుతోందని అనుకుంటున్నారు. చంద్రబాబు తమ నాయకుడిపై నిందలు వేశారని, అవి నిజం కాదని.. తెలంగాణ పార్టీ దెబ్బతినడానికి ఏపీ లోని ఇతర తెదేపా నాయకులు - చంద్రబాబుకు అనుంగు అనుచరులు అయిన వారి లోపాయికారీ విధానాలే అని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు కళ్లు తెరచి.. పార్టీకి అసలు నష్టం జరుగుతున్నది ఎవరి వల్లనో గుర్తించాలని వారు సలహా ఇస్తున్నారు.