Begin typing your search above and press return to search.

రాంమాధవ్‌ ను కలిసిన ఏపీ టీడీపీ నేతలు ఎవరు?

By:  Tupaki Desk   |   14 Jun 2019 4:18 AM GMT
రాంమాధవ్‌ ను కలిసిన ఏపీ టీడీపీ నేతలు ఎవరు?
X
హైదరాబాద్‌ లో పార్క్ హయత్‌ లో బీజేపీ కీలక నేత రాంమాధవ్ విడిది చేశారని.. తెలంగాణ కాంగ్రెస్ - టీడీపీ నేతలు కొందరు ఆయన్ను కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ నేతలు మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదని ఖండించేశారు. తెలంగాణ సంగతి పక్కన పెడితే ఏపీకి చెందిన కొందరు నేతలు కూడా రాంమాధవ్‌ ను కలిసినట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ టీడీపీ నేతలను పార్టీలోకి ఇప్పటికిప్పుడు తీసుకునే ఉద్దేశంలో లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలతో పాటు గెలిచిన నేతలూ కొందరు బీజేపీ వైపు చూస్తున్నారని.. వారిలో కొందరు రాంమాధవ్‌ ను కలిశారని టాక్.

ముఖ్యంగా చంద్రబాబు కేబినెట్ లో గతంలో పనిచేసి.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గెలిచిన ఓ టీడీపీ నేత రాంమాధవ్‌ తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీలో అసెంబ్లీ నడుస్తున్నందున సమయం చాలక హడావుడిగా కొద్ది నిమిషాలు మాత్రమే ఆయన రాంమాధవ్‌ తో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన ఉత్తరాంధ్రకు చెందిన మరో టీడీపీ నేత కూడా ఫోన్ లో సంభాషించినట్లు చెబుతున్నారు. ఇక కృష్ణా - గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు నేతలు.. రాయలసీమకు చెందిన ఓ నేత పేరు కూడా వినిపిస్తోంది. వీరంతా ఎవరికి వారు విడివిడిగా రాంమాధవ్‌ తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు టీడీపీ నుంచి ఎలాంటి నాయకులు వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను బీజేపీ ఇప్పటికే పంపించింది. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఇప్పటికే ఇలాంటి ప్రకటన చేశారు. రీసెంటుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ నుండి నేతలు వచ్చిన బిజెపిలో చేర్చుకుంటామని ప్రకటించేశారు. అందులో భాగంగానే ముందుగా టిడిపి నేతలను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ఒకరిద్దరు ప్రముఖ టీడీపీ నేతలను చేర్చుకుని పార్టీలో వారికి ప్రాధాన్యం ఇస్తే మిగతా నేతలు వస్తారని బీజేపీ భావిస్తోందట.