Begin typing your search above and press return to search.

నగరంలో కూటమికి దెబ్బే

By:  Tupaki Desk   |   12 Nov 2018 5:48 AM GMT
నగరంలో కూటమికి దెబ్బే
X
తెలంగాణ రాజధాని. భిన్న జాతులు - మతాలు - ప్రాంతాల వారికి ఆవాసం. రాయలసీమ - కోనసీమ - ఉత్తరాంధ్ర - సర్కారు జిల్లాల నుంచి వచ్చిన తెలుగు వారే కాదు.... తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి కూడా రాజధాని హైదరాబాద్ ఆవాసమైంది. వీరే కాదు గుజరాత్ - మహరాష్ట్ర - బిహార్ - పశ్చిమ బెంగాల్ వంటి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తమిళనాడు - కర్నాటక - కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఎక్కువే. దేశంలో ఏ రాష్ట్ర రాజధానిలోను జీవించేందుకు లేని అవకాశాలు హైదరాబాద్ నగరానికి ఉన్నాయి. ఇక్కడ నెలకు మూడు వేల రూపాయలు జీతం వచ్చే వారితో పాటు మూడు లక్షల రూపాయలు జీతం వచ్చే వారు కూడా హాయిగా బతికేందుకు అవకాశం ఉన్న నగరం హైదరాబాద్. అందుకే ఇక్కడికి లక్షలాది మంది కట్టుబట్టలతో వస్తారు. పిల్లాపాపలతో ‌హాయిగా బతుకుతారు. వీరందరికీ కావాల్సింది భరోసా. జీవితంపై ఆ భరోసాను కల్పించిన వారి పట్ల సెటిలర్లు చాలా కరుణ చూపిస్తారు. ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సెటిలర్ల కరుణ ఏ పార్టీకి ఉంటుందో వారు రాజులవుతారు. ఇప్పుడు సర్వత్రా అదే చర్చ.

రాష్ట్రం విడిపోయిన కొన్నాళ్ల వరకూ సెటిలర్లలో అభద్రతాభావం కనిపించేది. అయితే క్రమక్రమంగా దాని స్ధానంలో నమ్మకం పెరిగిందంటున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కారణంగా సెటిలర్లు ఇబ్బందులు పడిన దాఖలాలు లేవనే ప్రచారం జోరుగా ఉంది. పైగా మధ్యతరగతికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల సెటిలర్లు కాసింత ప్రేమను కనబరుస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మ‌హాకూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకూ చేసింది శూన్యమని - ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఇక్కడి ఓటర్లపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజధానిలో ఎప్పుడు బలం లేదు. ఒకటి రెండు చోట్ల గతంలో గెలిచినా ఇప్పుడు వారంతా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. దీంతో ఇక్కడ మహాకూటమి విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. రాజధానిలో కాసింత పట్టున్న భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ పుణ్యమాని అది కూడా పోయిందంటున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాల కారణంగా నగరంలో ఓటర్లు... ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లు కమలానికి దూరంగా ఉన్నారంటున్నారు. దీంతో ముందస్తు ఎన్నికల్లో రాజధానిలో కారు జోరు మరింత పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.