Begin typing your search above and press return to search.

అందరి నోటా సొంతింటికి వచ్చినట్లుగా ఉందన్న మాటే

By:  Tupaki Desk   |   27 Jun 2016 9:44 AM GMT
అందరి నోటా సొంతింటికి వచ్చినట్లుగా ఉందన్న మాటే
X
ఎన్నో భయాలు.. మరెన్నో సందేహాలు.. ఉంటామా?.. ఉండలేమా? అసలు ఉండటం సాధ్యమవుతుందా? అక్కడ పని వాతావరణం ఎలా ఉంటుంది? హైదరాబాద్ మహా నగరంతో పోల్చినప్పుడు బెజవాడ.. గుంటూరు ఏ పాటివి? అక్కడ సౌకర్యాల మాటేమిటి? ఇలా ఎన్నో అనుమానాల మధ్య.. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లే హైదరాబాద్ లోని ఏపీకి చెందిన పలు శాఖల కార్యాలయాలు ఏపీ రాజధాని బాట పట్టిన సంగతి తెలిసిందే.

గడిచిన కొద్దిరోజులుగా పలు శాఖలకు చెందిన ఉద్యోగులు ఏపీకి వెళ్లగా.. ఈ రోజు(సోమవారం) దాదాపు డజన్ కు పైనే శాఖలు ఏపీలో తమ కార్యకలాపాలు స్టార్ట్ చేశాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల్ని సాదరంగా ఆహ్వానించటం.. మిఠాయిలు తినిపించటం.. అభినందనలు తెలపటంతో ఉద్యోగులంతా సంతోఫడిపోయే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఏ శాఖకు ఆ శాఖ తమ ఉద్యోగులకు సంబంధించి వసతి సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించటం.. వారికి బస.. భోజనాలకు సంబంధించి ఒక వారం పాటు అంతా ఉచితమేనని చెప్పటం వారిని మరింత ఆనందానికి గురి చేస్తుంది. ఇక.. వివిధ శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన భవనాల్లోని వసతులన్నీ బాగుండటంతో హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రతి ఉద్యోగి సంతోషానికి గురి కావటమేకాదు..తమ సొంతింటికి వచ్చినట్లుగా ఉందని చెప్పటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. హైదరాబాద్ నుంచి తరలి వెళ్లిన ఉద్యోగుల్లో ఎవరూ అసంతృప్తికి లోనుకాకపోవటం.. ఏపీ రాజధానిలో సందడి వాతావరణంతో ఇప్పుడంతా హ్యాపీ మూడ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు.