Begin typing your search above and press return to search.

బాబు హైటెక్ అంతా వెలగపూడిలోనే!!

By:  Tupaki Desk   |   18 Oct 2016 10:01 AM GMT
బాబు హైటెక్ అంతా వెలగపూడిలోనే!!
X
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమేఘాల మీద నిర్మింపజేసిన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అక్కడ విద్యుత్ సమస్య వారిని ముప్పతిప్పలు పెడుతోంది. నిత్యం విద్యుత్‌ కోతలతో ఇక్కట్లు పడుతున్నామని అధికారులు - ఉద్యోగులు చెబుతున్నారు. కోతల ప్రభావం విద్యుత్‌ - ఎలక్ట్రానిక్‌ పరికరాలపై పడుతోందని.. జనరేటర్లు - ఇన్వెర్టర్ల సౌకర్యం లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోగానే కంప్యూటర్లు కూడా ఆగిపోతున్నాయని.. జనరేటర్ బ్యాకప్ కూడా లేకపోవడంతో సడెన్ గా కరెంటు ఆగిపోయిన ప్రతిసారీ అప్పటి వరకు చేసిన ప్రతి పనీ మళ్లీ మొదటికి వస్తోందని చెబుతున్నారు.

హైదరాబాద్‌ సచివాలయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన వెరటనే జనరేటర్ల ద్వారా విద్యుత్‌ సరఫరా ప్రారంభం కావడంతో పనులు సజావుగా సాగేవి. వెలగపూడిలో సచివాలయానికి విద్యుత్‌ సరఫరాకు ఏర్పాట్లు చేసిన క్రిడా - విద్యుత్‌ శాఖ అధికారులు జనరేటర్లు - ఇన్వర్టర్ల ఏర్పాటు చేయలేదు. విద్యుత్‌ సమస్యలతో ఒకటి రెండు శాఖల కార్యాలయాల్లో ఇప్పటికే కొంత నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖలో ఒక జిరాక్స్‌ మిషన్‌ కాలిపోయిందని.. ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. మరో శాఖలో కూడా ఒక మిషన్ పాడైందని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కంప్యూటర్లు పాడైతే మిగతా మరిన్ని సమస్యలు తలెత్తక తప్పదని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు అన్ని గదులూ ఏసీ అంటూ కిటికీలు తెరవడానికి వీల్లేకుండా ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ ఎయిర్‌ కండిషన్‌ విధానంతో అన్ని గదులు - హాళ్లకు అద్దాలు అమర్చి తెరిచే అవకాశం కూడా లేకుండా చేశారు. దీంతో కరెంటు ఆగిపోయినప్పుడు గాలి కోసం కనీసం కిటికీ కూడా తీయడం కుదరడం లేదు. దీంతో ఉక్కపోత తట్టుకోలేక ఉద్యోగులంతా కరెంటు ఆగగానే బయటకు వచ్చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు హైటెక్ పాలన అంతా వెలగపూడి సచివాలయంలోనే కనిపిస్తుందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/