Begin typing your search above and press return to search.

జనాన్నివారు పట్టించుకోరు కానీ..?

By:  Tupaki Desk   |   7 Dec 2015 4:09 AM GMT
జనాన్నివారు పట్టించుకోరు కానీ..?
X
నిత్యం తమ గురించి మాత్రమే కానీ.. జనం గురించి పట్టించుకున్న దాఖలాలు ప్రభుత్వ ఉద్యోగుల వైఖరిలో ఎప్పుడూ కనిపించదు. వారి సమస్యలు.. వారి డిమాండ్లు అన్నీ వారికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి కానీ.. జనానికి సంబంధించి అస్సలు ఉండవు. తమ జీతాలు.. ఇంక్రిమెంట్లు.. పీఆర్సీలు పెంపు.. అమలు మీదనే సమ్మెలు చేస్తారు కానీ.. ప్రజలకు సేవ చేయటానికి.. వారికి మరింత మెరుగైన సేవల గురించి కానీ.. రాజకీయ నాయకులు జోక్యాన్ని నిరసిస్తూ ఒక్కసారి అంటే ఒక్కసారి అయినా నిరసన ప్రదర్శన చేశారు.

నిరసన ప్రదర్శన దాకా ఎందుకు.. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వారి పనుల్ని జాప్యం లేకుండా చేయటం.. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేసే ఉద్యోగులు ఎందరు ఉన్నారు? సచివాలయంలో పనులు పడి.. ఆ ఆఫీసుల చుట్టూ తిరిగే వారికి.. అక్కడి ఉద్యోగులకు ఉండే కమిట్ మెంట్ ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. ఇక.. ఏపీ రాజధానికి వెళ్లుందకు సవాలక్ష రూల్స్ పెడుతున్న వారు.. తాజాగా వారు వినిపిస్తున్న మాట వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. బెజవాడకు వెళ్లాలంటే.. తమకు అందాల్సిన సాయం చిట్టా విప్పిన వారు.. ప్రజల నుంచి.. మీడియా నుంచి వెల్లువెత్తిన నిరసనతో కాస్త వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.

తాజాగా హైదరాబాద్ లోని గెజిటేటెడ్ అధికారుల సంఘం ప్రతినిధి యోగీశ్వరరెడ్డి మాట్లాడుతూ.. జూన్ 1 నాటికి విజయవాడకు రావాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసిన నేపథ్యంలో.. తాము బెజవాడకు రావటానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ.. తాము హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నామని తెలిసి.. విజయవాడలో అద్దెలు పెంచేశారని.. లివింగ్ కాస్ట్ పెరిగిందన్న ఆందోళన వ్యక్తం చేశారు.

దీని కారణంగా మధ్యతరగతి ఉద్యోగులు ఎలా భరిస్తారని ప్రశ్నించిన ఆయన.. అద్దెలో రాయితీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. జీతాలు భారీగా పెరిగితే.. అదంతా జనం మీద పడుతుందని.. తమకిచ్చే జీతాలు ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల మీదనే వస్తాయన్న విషయం ప్రభుత్వ ఉద్యోగులకు తెలియంది కాదా? అయినప్పటికీ ప్రజల గురించి పట్టించుకోకుండా తమ జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేయటం.. అవసరమైతే సమ్మె చేస్తుంటారు. తమ జీతాలు పెరిగితే ప్రజల మీద భారం పడుతుందని తెలిసినా.. పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులు.. ఇప్పుడు పెరిగిన అద్దె తట్టుకోలేమని.. దాన్ని భరించటం తమ వల్ల కాదని చెప్పటంలో అర్థం ఉందా?

బెజవాడలో ఇప్పటికే లక్షలాది మంది బతుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారిలో ఒకరే. ప్రభుత్వ ఉద్యోగులకు భారం పడినట్లే.. ప్రైవేటు వ్యక్తుల మీదా భారం పడుతుంది. ఎప్పుడూ తమ గురించి ఆలోచించే ప్రభుత్వ ఉద్యోగులు.. సమస్యను తెర మీదకు తెచ్చి.. అందరి గురించి ఎందుకు పోరాటం చేయరు? ఉద్యోగుల గురించి తప్పించి.. సామాన్యుల గురించి ఎందుకు ఆలోచించరు? ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికే అద్దెల భారం ఇంతగా ఉంటే.. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారి సంగతేంటి? వారి ఈతిబాధలకు చెక్ చెప్పేలా.. అందరికి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఎందుకు ఆలోచించరు? ఎందుకు గళం విప్పరు. ఏపీ సచివాలయ ఉద్యోగులకు తమ సమస్యలు మాత్రమే కనిపిస్తాయా? జనాల ఈతి బాధలు కనిపించవా? జనాల గురించి ఏ రోజు పట్టించుకోని వారికి.. ఈ రోజు జనం వారి గురించి పట్టించుకోవాలా? ఆ అవసరం ఉందంటారా?