Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయ ఉద్యోగులు మళ్లీ మొదలెట్టారా?

By:  Tupaki Desk   |   26 Feb 2016 8:03 AM GMT
ఏపీ సచివాలయ ఉద్యోగులు మళ్లీ మొదలెట్టారా?
X
విభజన కారణంగా తమకెన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఏపీకి వచ్చి పని చేయాలంటే తమకు తీర్చాల్సిన డిమాండ్ల గురించి ఏపీ సచివాలయ ఉద్యోగులు చెప్పటం తెలిసిందే. తొలుత వారు కోరిన కోర్కెల్ని ఓకే అన్నప్పటికీ.. రోజులు గడుస్తున్న కొద్దీ గొంతెమ్మ కోర్కెల్ని వినిపించిన ఏపీ సచివాలయ ఉద్యోగుల తీరుపై ఏపీ ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.

హైదరాబాద్ వదిలి రావటానికి సుతారం ఇష్టపడని వారు.. ఏపీ ప్రజల కోసం పని చేయాలన్న ప్రాధమిక విషయాన్ని మర్చిపోవటం.. తమ కోణంలో తప్పించి.. ఉద్యోగ ధర్మం ఏమాత్రం పట్టని వారి వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒకరు.. ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వాలని మరికొందరు.. డబుల్ హెచ్ ఆర్ ఏ ఇవ్వాలని ఇంకొందరు అంటే.. వీటన్నింటికి మించి హైదరాబాద్ టు విజయవాడకు ప్రత్యేక రైలు నడపాలంటూ కోరికల్ని కోరటం ఏపీ ప్రజలకు చిరాకు పుట్టించేలా చేసింది.

ఏపీ సచివాలయ ఉద్యోగులు డిమాండ్లపై సర్వత్రా వెల్లువెత్తిన ఆగ్రహంతో వెనక్కి తగ్గిన వారు.. కొద్ది విరామం తర్వాత మళ్లీ తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు. తాజాగా తెచ్చిన డిమాండ్లను చూస్తే.. జూన్ 15 నాటికి ఏపీ సచివాలయ ఉద్యోగులంతా అమరావతికి వచ్చేయాలన్న ఏపీ సర్కారు నిర్ణయం కారణంగా.. తమ పిల్లల స్థానికత విషయం మీద స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇక.. వారానికి ఐదు రోజులు పని గురించిన కోరికతో పాటు.. తమ పిల్లలు ఇంజనీరింగ్.. మెడిసిన్ చేస్తుంటే.. వారికి ఏపీలోని కాలేజీల్లో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు వసతి గృహాలు ఇవ్వాలన్న మరో డిమాండ్ ను కూడా వినిపిస్తున్నారు.

స్థానికత విషయంతో పాటు.. పిల్లల చదువులకు సంబంధించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరటం వరకూ ఫర్లేదు కానీ.. వారానికి ఐదు రోజుల పని.. మహిళా ఉద్యోగులకు వసతి గృహాలు లాంటి డిమాండ్లు సరికావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా డిమాండ్లను వినిపించే విషయంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఆచితూచి వ్యవహరించటం మంచిదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.