Begin typing your search above and press return to search.

సెటైర్‌ : చేతిసంచిలోకి ఏనుగు పెట్టివ్వాలంట!

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:54 PM GMT
సెటైర్‌ : చేతిసంచిలోకి ఏనుగు పెట్టివ్వాలంట!
X
అనగనగా కృష్ణదేవరాయలు ఆస్థానంలో రాజుగారికి ఓ సందేహం వచ్చింది. అన్నిటికంటె కష్టమైన పని ఏమిటి? అని రాజుగారు అడిగారు. ఒక్కొక్కరు ఒక్కో జవాబు చెప్పారు. వికటకవి తెనాలి రామలింగడు మాత్రం.. 'పసిపిల్లల్ని సముదాయించడం' అన్నాడు. రామలింగడంటే ఉక్రోషం ఉన్న పెద్దన గారు.. 'అదేమంత కష్టం .. నాకు సులువే' అని సవాలు చేశారు.

పంతం ముదిరింది. రామలింగడు పసివాడిలా నటించేలా, పెద్దన సముదాయించేలా పందెం పెట్టుకున్నారు.
ఇద్దరూ కలిసి సంతకెళ్లారు. తనను చంకకెత్తుకోమన్నాడు రామలింగడు. తప్పదు గనుక.. పెద్దన ఎత్తుకున్నాడు. ఓ సంచి కొనివ్వమంటే కొనిచ్చాడు. ఓ ఏనుగును కూడా కొనివ్వంటే అది కూడా కొనిచ్చాడు. ఇప్పుడు ఆ ఏనుగును ఆ సంచిలో పెట్టి నాకివ్వు అన్నాడు.. పసిపిల్లాడిలా అభినయిస్తున్న రామలింగడు.. ! ఇక పెద్దన ఏం చేయగలడు. 'అది కుదరదురా బాబూ' అంటే ఏడుపు లంకించుకున్నాడు.

అప్పటికి అర్థమైంది అల్లసాని పెద్దనకు.. పసిపిల్లలవి ఎంత గొంతెమ్మ కోరికలుగా ఉంటాయో?

===

ఇప్పుడు ఏపీ సచివాలయ ఉద్యోగుల విషయంలోనూ అదే జరుగుతోంది. ఎడ్మినిస్ట్రేషన్‌ గాడి తప్పుతోంది.. అందరూ విజయవాడకు రండయ్యా బాబూ అని ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ అక్కడనుంచి ఆహ్వానాలు పంపుతూ ఉంటే.. మాకు ఫ్యామిలీలు ఉన్నాయ్‌.. మాకు ఒక హెచ్‌ ఆర్‌ ఏ అదనంగా ఇస్తే వస్తాం.. మా ఫ్యామిలీలు ఇక్కడే ఉంటాయి.. మేం మాత్రం అక్కడ ఉండాలంటే.. ఒక హెచ్చార్ యే ఎక్కువ ఇవ్వాలి... అంటూ ఉద్యోగులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

రౌతు మెత్తనయితే గుర్రం మూడే కాళ్ల మీద నడుస్తుందని గుర్తించిన చంద్రబాబు ఇవాళ వారి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జూన్‌ అనేది తుది గడువుగా అంచెలంచెలుగా.. ఉద్యోగులు విజయవాడకు తరలివెళ్లడం జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.