Begin typing your search above and press return to search.

జగన్ ప్రభంజనం సృష్టించింది ఈనాడే..!

By:  Tupaki Desk   |   23 May 2020 2:00 PM IST
జగన్ ప్రభంజనం సృష్టించింది ఈనాడే..!
X
సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న నాయ‌కుడు ప్ర‌త్య‌ర్థి.. అధికారంలో ఉన్నవారిని ఢీకొట్టి ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికార ప‌క్షంగా మార్చిన సుదినం మే 23. గ‌తేడాది ఇదే రోజున వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భంజ‌నం సృష్టించారు. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో అపూర్వ మెజార్టీతో గెలుపొంది చ‌రిత్ర సృష్టించారు. ప్ర‌త్య‌ర్థులంద‌రూ ఒక్క‌టైనా సింగిల్‌గా వ‌చ్చి ఏకంగా 175లో 151 ఎమ్మెల్యే సీట్లు, 25లో 23 ఎంపీ సీట్లు సాధించి అపూర్వ విజ‌యం సొంతం చేసుకున్న‌ది ఈ రోజే. 49.95 శాతం (1,56,83,592) ఓట్లు రాబ‌ట్టి అధికారంలోకి వ‌చ్చింది ఈ దిన‌మే. అందుకే ఈ రోజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గుర్తుచేసుకుని సంబ‌ర ప‌డుతున్నారు.

వాస్త‌వంగా 2014లో కూడా ఒంట‌రిగా పోరాడి అప్ప‌టి తెలుగుదేశం పార్టీతో హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. చివ‌ర‌కు కొద్దిమొత్తంలో వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయింది. అప్పుడు రాష్ట్ర విభ‌జ‌న‌ - బీజేపీతో టీడీపీ పొత్తు - చంద్ర‌బాబు రాజ‌కీయం - మ‌ధ్య‌లో ప‌వ‌న్‌క‌ల్యాన్ ఎంట్రీ వంటి త‌దిత‌ర అంశాలు తెలుగుదేశం పార్టీలోకి అధికారంలోకి వ‌చ్చేలా చేశాయి. ఇక ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న వైఎస్సార్సీపీ తొలి నుంచి ప్ర‌భుత్వంపై పోరాడుతూనే ఉంది. ఏ ఒక్క అవ‌కాశం వ‌చ్చినా వ‌దిలి‌పెట్ట‌కుండా స‌ద్వినియోగం చేసుకుంది. నిరంత‌రం ప్ర‌జ‌ల వెంట ఉన్న‌ది.

ప్ర‌జ‌ల కోసం 6 న‌వంబ‌ర్ 2017న వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టారు. ఇడుపుల‌పాయ నుంచి మొద‌లు పెట్టిన యాత్ర 13 జిల్లాలు - 135 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు - 2,516 గ్రామాలను 341 రోజులు - 3,648 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసి చివ‌ర‌కు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించారు. జ‌న‌వ‌రి 9 - 2019న పాద‌యాత్ర ముగించి అప్ప‌టి నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్లారు.

పాద‌యాత్రలో ప్ర‌తి స‌మ‌స్య‌ను గుర్తించి నియోజ‌క‌వర్గం వారీగా మేనిఫెస్టో రూపొందించారు. ఈ సంద‌ర్భంగా రావాలి జ‌గ‌న్‌.. కావాలి జ‌గ‌న్ అనే నినాదంతో సోష‌ల్ మీడియాలో హోరున ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా న‌వ‌ర‌త్నాలు అనే ప‌థ‌కం రూపొందించారు. అధికారంలోకి రాగానే 9 ర‌కాల ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడ‌తాన‌ని పాద‌యాత్ర‌లో చెప్పారు. వైఎస్సార్ రైతు భ‌రోసా - వైఎస్సార్ చేయూత‌ - ఫీజు రీయింబ‌ర్స్‌ మెంట్‌ - ఆరోగ్య శ్రీ - జ‌ల‌య‌జ్ఞం - మ‌ద్య‌పాన నిషేధం - అమ్మ ఒడి - పింఛ‌న్ల పెంపు - పేద‌లంద‌రికీ ఇళ్లు వంటి ప్యాకేజీతో పేద‌లంద‌రికీ ప్ర‌తి ఏడాది రూ.5 ల‌క్ష‌లు ల‌బ్ధి పొందేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

పాద‌యాత్ర జోష్‌తో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముందుకు వెళ్లారు. ఎన్నిక‌లకు సర్వం సిద్ధ‌మ‌య్యారు. ఈసారి ఎన్నిక‌ల అభ్య‌ర్థుల ఖ‌రారు వినూత్నంగా చేప‌ట్టారు. పాద‌యాత్ర‌లో స్థానికుల మ‌నోభావాలు గుర్తించి కొంద‌రిని పాద‌యాత్ర‌లోనే ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే మీ అభ్య‌ర్థి ఇత‌డే.. ఎమ్మెల్యేగా గెలిపించండి అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విధంగా క్షేత్ర‌స్థాయిలో అంద‌రి అభిప్రాయం తెలుసుకున్న అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసి ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. వైఎస్ జ‌గ‌న్‌ కు తోడుగా కొంద‌రు సినీన‌టీన‌టులు - ప్ర‌ముఖులు నిలిచారు. ఇదే క్ర‌మంలో వైఎస్ విజ‌య‌మ్మ‌ - భార‌తి - ష‌ర్మిల త‌దిత‌రులు కూడా త‌మ‌వంతుగా ప్ర‌చారం చేశారు.

అన్ని అంశాలు క‌లిసొచ్చి 23వ తేదీన ఫ‌లితం తేలింది. 151 ఎమ్మెల్యే - 23 ఎంపీ సీట్లు గెలుపొంది అఖండ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి రాగా.. దేశ రాజ‌ధానిలో మూడో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. ఈ విధంగా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన ఈ రోజును వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డికి - వైఎస్సార్సీపీ నాయ‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన రోజు.