Begin typing your search above and press return to search.

అదరగొట్టే రికార్డును సొంతం చేసుకున్న ఏపీ!!

By:  Tupaki Desk   |   24 Aug 2020 9:15 AM IST
అదరగొట్టే రికార్డును సొంతం చేసుకున్న ఏపీ!!
X
అరటి పంట విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదరగొట్టేసింది. 2020 సంవత్సరానికి జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. ఐదేళ్లలో ఏపీ రైతులు తీసుకున్న చర్యలతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెబుతున్నారు. అరటి ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఐదేళ్ల క్రితం కేవలం 79వేల హెక్టార్లలో మాత్రమే పరిమితమైన అరటి పంట.. ఇప్పుడు అందుకు భిన్నంగా 1.05లక్షల ఎకరాలకు పెరగటం విశేషం. అంతేకాదు.. 2014-15లో హెకార్ట్ కు 44 టన్నులుగా ఉన్న దిగుబడి 2019 నాటికి 60 టన్నులుగా చేరటం మరో ఘనతగా చెప్పాలి.

ఇంతలో ఇంత మార్పునకు కారణం.. పంట విషయంలో ఏపీ రైతులు అనుసరించిన పద్దతులేనని చెబుతున్నారు. టిష్యూ కల్చర్ ల్యాబ్స్.. మైక్రో ఇరిగేషన్.. ఫలదీకరణలో కొత్త విధానాల్ని అనుసరించటంతో తాజా మార్పు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల పనితీరు కూడా పరిస్థితిని మార్చేలా చేసినట్లు చెబుతున్నారు. బనానా క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఎగుమతులకు అవసరమైన పంట ఎలా పండించాలో అవగాహన పెంచటం కూడా పరిస్థితిని మార్చేలా చేసింది.

ఈ కారణంతోనే ఏపీలో ఉత్పత్తి చేసిన అరటి పంటను కొనుగోలు చేయటానికి మధ్య.. తూర్పు దేశాలైన ఈజిఫ్ట్.. సౌదీ అరేబియా.. ఖతార్.. ఇరాన్.. బహ్రెయిన్.. యూఏఈ దేశాలు ఏపీలో పండించే అరటి పంట ఎగుమతులపై ఆసక్తిని చూపిస్తుండటం గమనార్హం. 2016-17లో 246 టన్నులుగా ఉన్న ఏపీ అరటి ఎగుమతులు.. 2019-20 నాటికి ఏకంగా 55 వేల టన్నులకు చేరటం విశేషం. తాజాగా తీసుకుంటున్న చర్యల పుణ్యమా అని రైతుకు హెక్టార్ కు గతాని కంటే మిన్నంగా రూ.2.90లక్షల ఆదాయం అధికంగా వస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీ అరటి రైతులు సాధించిన ఈ ఘనతను అభినందించాల్సిందే.