Begin typing your search above and press return to search.

పోలీసుల కంప్యూటర్లలో సమాచారం హుష్ కాకి?

By:  Tupaki Desk   |   13 May 2017 6:39 AM GMT
పోలీసుల కంప్యూటర్లలో సమాచారం హుష్ కాకి?
X
ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలపై పంజా విసిరిన రాన్సమ్ వేర్ మాల్ వేర్ ఏపీ పోలీసు శాఖను కూడా భారీగా దెబ్బతీసింది. ఏపీలోని 25 శాతం పోలీసు డిపార్ట్ మెంట్ కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు స్వయంగా డీజీపీ సాంబశివరావే ప్రకటించారు. అయితే, అదృష్టవశాత్తు ఆయన కంప్యూటర్ మాత్రం దీని బారిన పడలేదు. ఇందుకు ఆయన వాడుతున్న అత్యాధునిక సాంకేతికతే కారణమని తెలుస్తోంది.

మరోవైపు చిత్తూరు - గుంటూరు - విశాఖ - శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ ఎత్తున పోలీసు శాఖ సిస్టమ్స్ హ్యాక్ కావడంతో విలువైన సమాచారం - నేరస్థులు - కేసులకు సంబంధించిన కీలక సమాచారం పోయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. కానీ... ఐజీ - డీజీపీలు మాత్రం సమాచారమేదీ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే, మరిన్ని కంప్యూటర్లు దీని బారిన పడకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

కాగా ఇది ఏపీ పోలీసు శాఖ వైఫల్యంగా చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దేశంలోని మిగతా రాష్ర్టాల్లో ని పోలీసుల కంప్యూటర్లు కూడా ప్రమాదంలో పడ్డాయి. పలు ప్రభుత్వ - ప్రయివేటు సంస్థలూ ఈ మాల్ వేర్ కు దొరకిపోయాయి. ఇంటర్నేషనల్ గానూ ఇది కలకలం సృష్టిస్తోంది.

ఏపీలో అయితే... కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగింది. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు - తిరుపతి - కలికిరి పోలీసు స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. దీనికి సంబంధించి తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హ్యాకర్లు విన్సీ వైరస్ ను చొప్పించడంతో ఇది జరిగింది. హ్యాకింగ్ కు గురైన కంప్యూటర్ల డీకోడింగ్ కు ప్రయత్నిస్తున్నారు.

ప్రపంచం వ్యాప్తంగా సమాచార - ఐటీ - బ్యాంకింగ్ రంగాలు కుప్పకూలుతున్నాయి. హ్యాకర్ల ధాటికి లండన్ లో వైద్య ఆరోగ్య సేవలు స్థంభించాయి. సరికొత్త మాల్ వేర్ తో దాడులు చేసిన హ్యాకర్లు...ఈ కంప్యూటర్లను తిరిగి ఓపెన్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్ గా నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ లైన్స్ తోపాటు ఇతర సంస్థలు కూడా సైబర్ ఎటాక్ బారినపడ్డాయని తెలుస్తోంది. కంప్యూటర్ ఓపెన్ చెయ్యగానే ఒక మెసేజ్ వస్తోందని, అది ఓపెన్ చేయ్యగానే...కంప్యూటర్ మొత్తం కోడింగ్ లోకి మారిపోతుందని తెలుస్తోంది. దానిని తిరిగి ఓపెన్ చెయ్యాలంటే డబ్బులు కట్టాలని మెసేజ్ కూడా వస్తోంది. దీంతో దీనిని డీ కోడ్ చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ సైబర్ అటాక్ బారిన అమెరికా, రష్యా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు, చైనా తదితర దేశాలు ఉన్నాయి. అమెరికా వాడే హ్యాకింగ్‌ టూల్స్‌నే హ్యాకర్లు కొల్లగొట్టారు. తద్వారా వేలాది కంప్యూటర్లలో రాన్సమ్‌వేర్‌ వైరస్‌ను ప్రవేశపెట్టి సమాచారాన్ని చోరీ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఈ రాన్సమ్‌వేర్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.

'వన్నా క్రై' అనే పేరుతో కంప్యూటర్లలోకి చొచ్చుకుపోతున్న ఈ వైరస్‌..క్షణాల్లో కంప్యూటర్ వ్యవస్థను స్తంభింపజేస్తుంది. వైరస్‌ ఎంటరైన క్షణాల్లోనే..డబ్బు చెల్లిస్తేగానీ పని నడవదంటూ ఓ సందేశం కన్పిస్తోంది. ఆ వెంటనే మొత్తం ఐటీ వ్యవస్థ సమస్తం మొరాయిస్తుంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఏకంగా 45 వేలకు పైగా సైబర్‌ దాడులు జరిగినట్లు గుర్తించారు. సుమారు 60వేల కంప్యూటర్ల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. ప్రపంచంలో అత్యంత భద్రతా విభాగం ఉన్న అమెరికా భద్రతా విభాగం అమెరికా జాతీయ సెక్యూరిటీ సంస్థ ఉపయోగించే హ్యాకింగ్‌ టూల్స్‌తో ఈ సైబర్‌దాడులు జరిగాయి. ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు దీని బారిన పడ్డాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/