Begin typing your search above and press return to search.

గజల్ విషయంలో లేటు చేసిన చంద్రబాబు!

By:  Tupaki Desk   |   7 Jan 2018 10:52 AM GMT
గజల్ విషయంలో లేటు చేసిన చంద్రబాబు!
X
గజల్ శ్రీనివాస్ అమ్మాయిలను లైంగికంగా వేధించడం వంటి నీచమైన పనికి పాల్పడ్డాడు అంటే.. ఆయనతో పరిచయం ఉన్న చాలా మంది తొలుత నమ్మలేకపోయారు. కానీ వీడియోలు కూడా విడుదల కావడంతో.. తాము ఇన్నాళ్లూ ఇలాంటి వ్యక్తితో స్నేహం చేశామా అని నివ్వెరపోయారు. ఏపీలో మంత్రి మాణిక్యాల రావే.. తొలుత అడ్డంగా గజల్ ను వెనకేసుకు వచ్చి.. కేవలం కొన్ని గంటల వ్యవధిలో నాలుక కరచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గజల్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్న సేవ్ టెంపుల్ సంస్థ అలాంటి పొరబాటు చేయలేదు. ఆయన అరెస్టు అయిన వెంటనే.. ఆ పదవినుంచి తొలగించేశారు. తాజాగా చూడబోతే.. గజల్ విషయంలో.. ఇన్ని రోజులు లేటుగా స్పందించింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమే అనిపిస్తోంది.

గజల్ శ్రీనివాస్ అకృత్యాలు సోషల్ మీడియాలో వెల్లువలా అసహ్యం పుట్టించేస్తోంటే.. ఇన్ని రోజుల పాటూ చంద్రబాబునాయుడు ఆయనను ఏ కారణాల చేత సహించారో - ఉపేక్షించారో అర్థం కాని సంగతి. శనివారం రాత్రి ఆయన మీద చర్య తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో గజల్ కు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. కేవలం చంద్రబాబుతో మాత్రమే కాకుండా - పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పే పలువురు ప్రముఖులతో ఆయన సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో 2017 మేలోనే చంద్రబాబు గజల్ ను ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ కు బ్రాండ్ అంబాసిడ్ చేశారు.

చంద్రబాబునాయుడు సకాలంలో మేలుకుని ఉంటే.. ఈ లైంగిక వేధింపుల వివాదం రేగిన వెంటనే తొలగించి ఉండాల్సింది. కాకపోతే ఆయన రోజుల తరబడి జాగుచేసి చివరికి శనివారం రాత్రి ఉత్తర్వుల్లో గజల్ ను ఆ పదవినుంచి తొలగించారు.

గజల్ తనను తెలంగాణ వాదులు కేసులో ఇరికించారని చెప్పుకున్నాడు గనుక.. ఆ విషయం ఆ రకంగా నిరూపణ అయితే.. కాపాడుకుందాం అని చంద్రబాబు ఇన్నిరోజులు వేచిచూశారని.. చివరికి వీడియోల్లో ఉన్న కంటెంట్ అత్యంత నీచమైనదని విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసిన తర్వాత మాత్రమే వేటు వేశారని సమాచారం. అయినా.. ఎంతగా తాము నెత్తిన పెట్టుకున్న ఆప్తులే కావొచ్చు.. వారు తప్పుచేసి దొరికిపోయిన తర్వాత కూడా చర్య తీసుకోవడంలో జాప్యం చేస్తే ఎలా బాబుగారూ అని జనం అనుకుంటున్నారు.