Begin typing your search above and press return to search.

షాక్ః అసెంబ్లీ అయిపోగానే చార్జీలు పెంచేశారు

By:  Tupaki Desk   |   1 April 2017 11:04 AM IST
షాక్ః అసెంబ్లీ అయిపోగానే చార్జీలు పెంచేశారు
X
ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం పౌరుల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. వెల‌గ‌పూడిలో ఏపీ అసెంబ్లీ వాయిదా ప‌డిన కొద్ది స‌మ‌యం త‌ర్వాత హైదరాబాద్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యుత్‌ నియంత్రణ మండలి నూతన విద్యుత్‌ ఛార్జీలను ప్రకటించింది. ఎపీఈఆర్‌సీ ఛైర్మన్‌ భవానీ ప్రసాద్‌ పెంపు వివరాలను వెల్లడించారు.సగటున 3.6శాతం మేర ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. తాజా పెంపు వల్ల 800 కోట్ల రూపాయల అదనపు రాబడి వస్తుందని ఆయన చెప్పారు. అయితే, ప్రజలపై పడే భారం ఇంతకన్నా ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా పెంపు ప్ర‌కారం 1-200 యూనిట్లు వాడే వినియోగదారులకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి పెంపు లేదు. 200 నుండి 500 యూనిట్ల వరకు వాడే వినియోగదారులపై 3 శాతం వరకు భారం వేశారు. దీని ప్రభావం మధ్య తరగతిపైనా, ఎగువ మధ్య తరగతి ప్రజలపైనా పడనుంది. ఏ క్యాటగిరీలో ఏడాదికి 900 యూనిట్లు వాడే వినియోగదారులపై కూడా ఎటువంటి భారం పడదు. 900 నుండి 2,700 యూనిట్ల వరకు వినియోగించే వారినుండి నెలకు 10 రూపాయల కస్టమర్‌ ఛార్జీలను వసూలు చేయనున్నారు. మొత్తం 1.59 కోట్ల వినియోగదారుల్లో 1.44 కోట్లమందికి ఛార్జీలు పెంచడం లేదని, 1.28 కోట్ల మందినుంచి ఎటువంటి ఫిక్స్‌డ్‌ ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీఈఆర్సీ తెలిపింది.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఛార్జీలు పెంచడం ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది వైసీపీ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదని, తాజా నిర్ణ‌యం ప్ర‌జ‌ల‌ను మోసం చేయడమేనని వైసీపీ మండిప‌డింది. కేంద్రం విద్యుత్తు రంగంలో ఉదరు పథకం కింద సాయమందిస్తుండటం, రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్తు మిగులు పరిస్థితి ఏర్పడితే విద్యుత్తు చార్జీలు తగ్గించాల్సింది పోయి పెంచడం గర్హనీయమని పేర్కొంది. రూ.859 కోట్లు చార్జీల రూపంలో, మరో రూ.268 కోట్లు ఇతర రూపాల్లో వినియోగదారులపై భారం వేస్తుండ‌టం ఏమిట‌ని పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భవిష్యత్తులో ఈ భారం మరింత పెరుగుతుందన్నారు. గృహవినియోగదారులు, చిన్న పరిశ్రమలు, స్థానిక సంస్థలపై ప్రభావం ఉంటుందని తెలిపింది. పరోక్షంగా ఫిక్స్‌ డ్‌ చార్జీలు, డిమాండ్‌ చార్జీల తరహాలో భారం అధికంగా ఉంటుందని పేర్కొంది. ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు అధిక మొత్తంలో దోచిపెడుతూ వినియోగారులకు జేబులకు చిల్లు పెడుతున్నట్లు మండిప‌డింది. పీపీఏలను సమీక్షిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/