Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: కరోనా భయం.. 27నుంచి ఏపీ అసెంబ్లీ

By:  Tupaki Desk   |   23 March 2020 5:26 AM GMT
బ్రేకింగ్: కరోనా భయం.. 27నుంచి ఏపీ అసెంబ్లీ
X
ఓ వైపు కరోనా వైరస్ కబళిస్తోంది. దూసుకొస్తోంది. మరోవైపు ఏపీలో బడ్జెట్ ప్రతిపాదించి వ్యయం చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ పెట్టకపోతే ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం నడవడమే కష్టం. ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 27నుంచి కొద్దిరోజులు మాత్రమే నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

27న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని తెలిసింది. 29న శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2020-21 ఆర్థిక ఏడాదికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీని కేవలం 3 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 30వ తేదీన పూర్తి బడ్జెట్ కు కాకుండా కేవలం నెల లేదా రెండు నెలల వ్యయానికి సరిపడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు అసెంబ్లీ నుంచి ఆమోదం పొందించి ప్రభుత్వాన్ని నడిపించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలిసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీలో స్క్రీనింగ్, ఇతర కరోనా గుర్తించే పరికరాలను పెట్టి అందరినీ చెక్ చేశాకే పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ప్రజాప్రతినిధుల్లో ఒక్కరికి లక్షణాలు ఉన్నా వ్యాప్తి చెందనున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రభుత్వానికి సంక్లిష్టంగా మారింది.