Begin typing your search above and press return to search.

కఠిన వాస్తవం; ఈ ఆంధ్రోళ్లు ఇంతేనా..?

By:  Tupaki Desk   |   16 Jun 2016 5:30 PM GMT
కఠిన వాస్తవం; ఈ ఆంధ్రోళ్లు ఇంతేనా..?
X
ఆంధ్రోళ్లకు ఏమైంది? ఈ ప్రశ్నలో ఆవేదన.. ఆవేశం కలగలిపి ఉంటుంది. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల మీద వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రోళ్ల ఆక్రోశంగా దీన్ని చెప్పాలి. తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితుల్ని చూసినప్పుడు.. ఈ కులాభిమాన భూతం ఏపీని విడిచి పెట్టదా? అన్న సందేహం రాక మానదు. ఏపీకి ఏదైనా అన్యాయం జరిగితే.. నోరు విప్పి మాట్లాడటానికి ఇష్టపడని ఆంధ్రా ప్రాంత నేతలు.. తమ కులానికి సంబంధించిన విషయాల మీద మాత్రం రంకెలు వేయటం కనిపిస్తుంది. కులానికి జరిగే అన్యాయం కారణంగా కులం వారు మాత్రమే నష్టపోతారు. ఆ విషయానికే ఎంతో సీరియస్ అవుతున్న వారు.. ఆంధ్రోళ్లు అంతా అన్యాయానికి గురైతే ఎంత ఫీల్ కావాలి? మరెంతగా రగిలిపోవాలి? ఏపీకి జరుగుతున్న నష్టంపై వారెంత విరుచుకుపడాలి? అన్న ప్రశ్నలు మదిని తొలిచేయటం ఖాయం.

ఇప్పటివరకూ దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడినా మరే రాష్ట్ర ఆవిర్భావంలోనూ తాము విడిపోతున్న రాష్ట్రాన్ని.. రాష్ట్ర ప్రజల్ని దొంగలుగా చిత్రీకరిస్తూ.. దోపిడీకి పాల్పడ్డారన్న నిందలు వేయలేదు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆంధ్రా ప్రజలను నోటికి వచ్చినట్లు తిట్టినా ఏ నాయకుడు కేసీఆర్ మాటల్ని తప్పు పట్టలేదు. కేసీఆర్ చేసిన వాదన తప్పు అంటూ శాస్త్రీయ ఆధారాలుచూపిస్తూ మాట్లాడిన పాపాన పోలేదు.

అంతేనా.. ఏపీని రెండు ముక్కలు చేయటానికి పార్లమెంటు తలుపులు మూసేసి.. లైవ్ టెలికాస్ట్ కట్ చేసి మరీ విభజన బిల్లును పాస్ చేసినప్పుడు ఆంధ్రాకి చెందిన ఏ నాయకుడి గుండె పగల్లేదు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేయలేదు. ఏపీకి ఎంత అన్యాయం చేశారంటూ కళ్లెర్ర చేసి.. గుండెలు బాదుకొని ఆమరణ నిరాహార దీక్షలు చేయలేదు.

అంతదాకా ఎందుకు.. దేశ ప్రధానే స్వయంగా రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వటంతో పాటు.. మరిన్ని హామీలు ఇస్తే.. ఆ మాటలకు మరింత వెన్న రాసి.. దేశ రాజధాని ఢిల్లీ కంటే గొప్పదైన రాజధానిని నిర్మిస్తామంటూ మాటలు చెప్పిన పెద్ద మనిషి తర్వాత ఆ మాటను మర్చిపోతే.. గుర్తు చేయటానికి ఏ ఏపీ నేత నడుం బిగించకపోవటం గమనార్హం. ఐదుకోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు దెబ్బ తింటున్నా.. వారి భవిష్యత్ తరాల మీద ప్రభావం పడేలా ఉన్నా.. ఆ విషయానికి ఒక భారీ నిరసన ప్రదర్శన ఉండదు.. ఆ మోసానికి ఆమరణ నిరాహారదీక్షలు చేయటానికి నడుం బిగించరు.

కానీ.. ఒక కులానికి సంబంధించిన అంశంలో రైలు తగలబెట్టి.. ఒక పట్టణం భీతిల్లిపోయేలా వ్యవహరించిన ఘటనలో పాలు పంచుకున్న కొందరిని పోలీసులు అన్ని కోణాల్లో విచారించి.. వారిది తప్పు అని తేల్చి అరెస్ట్ చేస్తే.. ఆమరణ నిరాహార దీక్ష.. ఆ ఘటనకు ఒక జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారితే.. ఇక రాష్ట్రమైతే ఏ నిమిషాన ఏం జరుగుతుందో అన్న ఆందోళన చెందటం ఏమిటి? ఒక కులానికి అన్యాయం జరిగితే అంతలా చెలరేగిపోయే నేతలు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు పెట్టి మరీ మండిపడే నాయకులు.. ఏపీకి జరిగే అన్యాయం గురించి ఎందుకు గళం విప్పరు? తమ జాతికి అన్యాయం జరిగితే ఆక్రోశించే వారు.. మొత్తం ఆంధ్ర జాతికి ఇబ్బంది కలిగితే ఏమీ పట్టదా? అన్నది పెద్ద ప్రశ్న. ఇవన్నీ చూసినప్పుడు ‘‘ఈ ఆంధ్రోళ్లు ఇంతేనా?’’ అని అనుకోవటంలో ఏమైనా తప్పు ఉందా..?