Begin typing your search above and press return to search.

మోడీకి గుర్తున్నది మన స్టార్లకు గుర్తుకు రాలేదేం?

By:  Tupaki Desk   |   2 Nov 2020 11:15 AM IST
మోడీకి గుర్తున్నది మన స్టార్లకు గుర్తుకు రాలేదేం?
X
అంటే అన్నామని గింజుకుంటారు కానీ.. సినీ స్టార్లు.. సెలబ్రిటీల తీరు చూస్తే ఒళ్లు మండిపోక మానదు. అభిమానుల అభిమానంతో బతికేసే స్టార్లు.. సెలబ్రిటీలు.. వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి సంబంధించిన కీలకమైన తేదీల్ని అంత నిర్లక్ష్యంగా చూస్తారా? నవంబరు ఒకటి రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఇలాంటి వేళ.. సదరుదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెబితే పోయేదేమిటి? అసలు ఎందుకు చెప్పాలి? ఉత్త పుణ్యానికే సినీ తారల్ని టార్గెట్ చేస్తుంటారని కొందరు పెంకిగా మాట్లాడొచ్చు. ఒకవేళ.. వారిది అదే ప్రశ్న అయితే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు ఎందుకు చెబుతున్నట్లు?

దినోత్సవం ఏ రాష్ట్ర ప్రజలకైనా ఒకేలా ఉంటుంది. తెలంగాణ వారికి ఒకలా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరోలా ఉండదు. మరీ.. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు పెట్టుకొని మరీ సోషల్ మీడియాలో పోస్టుచేసి.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పగా లేనిది.. మన సినీ తారలు.. సెలబ్రిటీలకు ఏమైందన్నది ప్రశ్న.

మరింత విషాదం ఏమంటే.. ఈ రోజున టాలీవుడ్ లో ఉన్న తారల్లో అత్యధికులు ఏపీ మూలాలు ఉన్న వారు. తమ స్వరాష్ట్ర ఆవతరణ దినోత్సవం గురించి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటమా? అన్నది ప్రశ్న. సినీ తారలే కాదు.. రాజకీయ నేతలు పలువురు ఏపీ ఆవతరణ దినోత్సవ వేళ.. ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పటం కనిపించలేదు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నే తీసుకుంటే.. బీజేపీ మిత్రుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఎలాంటి సందేశాన్ని ఏపీ ప్రజలకు ఇచ్చింది లేదు. సందేశం వరకు ఎందుకు శుభాకాంక్షలకే దిక్కు లేదని చెప్పాలి. ఏపీ రాష్ట్రంలో సినీ తారలకు విశాఖలో భూములు ఇస్తానంటే చాలు.. క్యూ కట్టే వారు.. రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేళ.. శుభాకాంక్షలు చెప్పాలన్న కనీస ఆలోచన కూడా రాకపోవటం దేనికి నిదర్శనం?