Begin typing your search above and press return to search.

బాబు....జైట్లీ కూడా నిరాశ‌ప‌ర్చారు

By:  Tupaki Desk   |   29 Oct 2016 5:44 AM GMT
బాబు....జైట్లీ కూడా నిరాశ‌ప‌ర్చారు
X
కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ.... కేంద్ర ప్ర‌భుత్వ నిధుల విష‌యంలో ప్రధాని నరేంద్రమోడీ త‌ర్వాత అంత‌టి ప్ర‌త్యేక‌త ఉన్న కేంద్ర మంత్రి. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావ‌తిలో కోర్ క్యాపిటల్ ప‌రిధిలో ప్రభుత్వ భవనాల శంకుస్థాపనకు వస్తున్న సంద‌ర్భంగా జైట్లీపై పెద్ద ఎత్తున అంచనాలు వెలువ‌డ్డాయి. ఏపీ విష‌యంలో కీలకమైన రెండు అంశాలైన ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త‌, క్యాపిట‌ల్ గెయిన్ టాక్స్ విషయంలో రైతుల‌కు ఉపశమనంపై స్పష్టమైన హామీ ఇస్తార‌ని ఆశించారు. అయితే వాటిపై ప్ర‌క‌ట‌న‌లు దాట‌వేసిన జైట్లీ జాతీయ విద్యాసంస్థలు - పరిశ్రమలు - జాతీయ రహదారుల విస్తరణకే పరిమితమవడంతో ఆయ‌న పర్యటనపై వివిధ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం చంద్ర‌బాబు చేసిన మంత‌నాలు సైతం ఫ‌లించ‌లేన‌ట్లుగా ఉన్నాయ‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అమ‌రావ‌తిలో శంకుస్థాప‌న చేసిన త‌ర్వాత అంతే అట్ట‌హాసంగా జ‌రిగిన ప్రభుత్వ భవనాల నిర్మాణపనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన జైట్లీపై రాష్ట్ర ప్రభుత్వం - భూమి ఇచ్చిన రైతాంగం బోలెడు ఆశలు పెట్టుకుంది. ప్రధానమైన రెండు అంశాలపై ఆయన స్పష్టత ఇస్తారని ప్రభుత్వం కూడా ఆశించింది. ప్రత్యేక హోదా బదులు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం - ఇప్పటివరకూ దానికి చట్టబద్ధత కల్పించలేదు. కనీసం న్యాయశాఖకూ దాని ప్రతిపాదనను పంపలేదు. అక్కడి నుంచి ఆమోదముద్ర వస్తే తప్ప కేంద్రమంత్రివర్గం దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ప్యాకేజీని ప్రకటించింది జైట్లీనే కాబట్టి, దానికి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రజలకు హామీ కూడా ఆయనే ఇస్తారని అంతా భావించారు. కానీ, జైట్లీ దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంలో జైట్లీ కూడా ప్రధాని మోడీ తరహాలో వ్యవహరించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ రాష్ట్రానికి నయాపైసా ప్రకటించకుండా నీళ్లు - మట్టి మాత్రమే ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు జైట్లీ కూడా కీలకమైన రెండు సమస్యలపై ఎలాంటి హామీ ఇవ్వకుండా శంకుస్థాపన చేసి వెళ్లిపోవడం నిరాశ కలిగించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చిన రైతులు, చాలాకాలం నుంచి క్యాపిటల్ గెయిన్‌ టాక్స్ గురించి ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్ముకునే సందర్భంలో వారికి ఆదాయపు పన్ను పడకుండా మినహాయింపు ఇచ్చే క్యాపిటల్ గెయిన్ టాక్స్‌పై జైట్లీ స్పష్టమైన హామీ ఇచ్చి, రైతుల పెదవులపై చిరునవ్వులు పూయిస్తారని ఆశించారు. అయితే తాను ఢిల్లీ వెళ్లిన తర్వాత పరిశీలిస్తానని మాత్రమే హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల ముఖంలో చిరునవ్వులు చూడబోతున్నానని వ్యాఖ్యానించిన జైట్లీ, ఆచరణలో మాత్రం దానిని అమలుచేయపోవడం భూమి ఇచ్చిన రైతులకు అసంతృప్తి మిగిలించింది.

జైట్లీ విజయవాడకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనతో అర్ధగంట ఏకాంతంగా చర్చించారు. ఆ సందర్భంగా కూడా బాబు ఈ రెండు అంశాలనే ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. హోదా స్థానంలో ప్యాకేజీ ఇస్తామన్న మీ ప్రతిపాదనను గౌరవించి ఆమోదించినా, ఇప్పటివరకూ దానికి చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల.. ఇది కూడా విభజన చట్టంలా గందరగోళమవుతుందన్న ఆందోళన ఉందని జైట్లీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే హోదాపై విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని, అయితే, ఇరు పార్టీలు ప్యాకేజీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తే రెండు పార్టీలకూ గౌరవం ఉంటుందని అభ్యర్ధించారు. అటు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్యగా ఏర్పడ్డ రైతు ప్రతినిధులు కూడా జైట్లీని కలిశారు. రాజధాని కోసం 22,247 మంది రైతులు, 29 గ్రామాల పరిథిలో 33,692 ఎకరాల భూమి ఇచ్చామని, అందువల్ల తమకు భూమి అమ్ముకునే సమయంలో ఆదాయపన్ను లేకుండా ఉత్తర్వులివ్వాలని జైట్లీని కోరినా స్పష్టమైన హామీ లభించలేదు. అయితే, అమరావతి సభలో మాట్లాడిన జైట్లీ రాష్ట్రానికి మరికొన్ని జాతీయ విద్యాసంస్థలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, కొత్త పరిశ్రమలు మంజూరు చేస్తామని, జాతీయ రహదారుల నిర్మాణాలతోపాటు విస్తరణపైనా హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/