Begin typing your search above and press return to search.

కొత్త మంత్రులు వీరేనా?

By:  Tupaki Desk   |   13 Sep 2016 7:30 PM GMT
కొత్త మంత్రులు వీరేనా?
X
ఏపీలో దసరా నాటికి కొత్త మంత్రులు వస్తారన్న అంచనాల నేపథ్యంలో టీడీపీలో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ముగ్గురిని కొత్తగా మంత్రివర్గం నుంచి తీసుకుంటారన్న ప్రచారం ఒకటి టీడీపీలో మొదలవడంతో ఆ ప్రాంత నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. అయితే... చంద్రబాబు లెక్కల ప్రకారం అక్కడి నుంచి ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఉందని తెలుస్తోంది.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల నుంచే కొత్తగా ముగ్గురిని తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు జిల్లాల నుంచి ఇద్దరు మంత్రులున్నారు. శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తుండగా విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మృణాళిని మాత్రం చంద్రబాబు ర్యాంకింగుల్లో వెనుకంజలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పించి ఆమె స్థానంలో అదే కుటుంబానికి చెందిన ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావుకు ఛాన్సివ్వాలని చంద్రబాబు డిసైడనట్లు తెలుస్తోంది. ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆ జిల్లాకు అదనంగా మరో మంత్రి పదవి ఇవ్వడంతో పాటు కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్లవుతుంది.

ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బొబ్బిలి రాజా రంగారావుకు మంత్రి పదవి గ్యారంటీ అని తెలుస్తోంది. ఆయనతో పాటు అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి కూడా బెర్తు ఖరారైనట్లు సమాచారం.ఒక్క ఉత్తరాంధ్ర నుంచే ముగ్గురు కొత్తగా వస్తున్నా ఒకరికి ఉద్వాసన ఉండడంతో కొత్తగా ఇద్దరు చేరినట్లు అవుతుంది. వీరితో పాటు ప్రకాశం - నెల్లూరు - కర్నూలు - కడప - పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో సతీశ్ రెడ్డి - పశ్చిమలో షరీఫ్ లకు బెర్తు ఖాయమని తెలుస్తోంది.

బెర్తులు దాదాపుగా నిర్ణయం అయినప్పటికీ మిగతా ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు. పలువురు కొత్త ఎమ్మెల్యేలు - వైసీపీ నుంచి వచ్చినవారు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.