Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటులో వైసీపీ ఎంపీల ఆందోళ‌న‌...

By:  Tupaki Desk   |   14 March 2018 7:53 AM GMT
పార్ల‌మెంటులో వైసీపీ ఎంపీల ఆందోళ‌న‌...
X

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని, విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ....కొద్ది రోజులుగా టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్ల‌మెంటులో ఆందోళ‌న కొనసాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం నాడు జ‌రిగిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో కూడా వైసీపీ ఎంపీలు త‌మ నిర‌స‌న తెలిపారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల‌ను వెంట‌నే నెర‌వేర్చాల‌ని వైసీపీ ఎంపీలంతా పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లో కూడా ఏపీ ఎంపీలు ఆందోళ‌న చేశారు. ఏపీ ఎంపీల‌ను స్పీకర్‌ వారించినా వారు విన‌లేదు. కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మైన ప్రకటన వ‌చ్చేవ‌ర‌కు తమ నిర‌స‌న‌లు ఆగ‌వ‌ని వారు తేల్చి చెప్పారు. దీంతో, 8వ‌ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంత‌రం వైపీపీ ఎంపీల‌తో పాటు టీడీపీ ఎంపీలు క‌లిసి పార్ల‌మెంటు బ‌య‌ట ప్ల‌కార్డులు చేత‌బ‌ట్టి కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆందోళ‌న చేప‌ట్టారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్లుకోవాలంటూ డిమాండ్ చేశారు.

కేంద్రంవైఖ‌రికి నిర‌స‌న‌గా చిత్తూరు ఎంపీ శివప్రసాద్....రోజుకో వేషంతో పార్ల‌మెంటు వ‌ద్ద వినూత్న నిర‌స‌న తెలుపుతోన్న సంగ‌తి తెలిసిందే. కోయ దొర, ఎన్టీఆర్...ఇలా ర‌క‌ర‌కాల వేషాలు వేసిన శివ‌ప్ర‌సాద్.... బుధవారం నాడు చర్చి ఫాదర్ వేషంలో వ‌చ్చారు. బైబిల్ చేత‌బ‌ట్టి పార్ల‌మెంటు వ‌ద్ద నిర‌స‌న తెలుపుతున్న శివ‌ప్ర‌సాద్ ....జాతీయ మీడియాతో పాటు ప‌లువురు జాతీయ నేత‌ల దృష్టిని ఆక‌ర్షించారు. మ‌రోవైపు, ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం అండగా నిలవాలని అన్ని పార్టీల ఎంపీలకు తిరుమల వెంకన్న ప్రసాదాన్ని పంచిపెడుతున్నామ‌ని టీడీపీ ఎంపీ మాగంటి బాబు తెలిపారు. కాగా, లోక్ సభ -రాజ్యసభలు వాయిదాల అనంతరం తిరిగి ప్రారంభమైన‌ప్ప‌టికీ ఎంపీల ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు - త‌మ రాష్ట్రానికి రిజర్వేషన్ల బిల్లు కోసం టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న‌లు తెలిపారు. ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితుల మ‌ధ్య కొన్ని బిల్లులను స్పీక‌ర్ ప్రవేశపెట్టారు.