Begin typing your search above and press return to search.

అబ్బో.. ఏపీ ఎంపీల‌కు సురుకు పుట్టిందే..!

By:  Tupaki Desk   |   23 July 2015 8:54 AM GMT
అబ్బో.. ఏపీ ఎంపీల‌కు సురుకు పుట్టిందే..!
X
చైత‌న్యం అన్న ప‌దార్థం లేనట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. హ‌క్కుల కోసం పోరాడేందుకు ఏ మాత్రం సుముఖంగా ఉండ‌దని ఏపీ ఎంపీల్లో క‌ద‌లిక వ‌చ్చింది. త‌మ హ‌క్కుల సాధ‌న కోసం ఎవ‌రితోనైనా సై అంటే సై అనేసే తెలంగాణ ఎంపీల‌ను చూడ‌టం వ‌ల్ల‌నో.. ప్ర‌శ్నించే ప‌వ‌న్ ఎక్క‌డ క‌డిగేస్తార‌ని అనుకున్నారో? లేక‌.. ఏపీ ముఖ్య‌మంత్రి నుంచి వ‌చ్చిన డైరెక్ష‌నో కానీ.. ఏపీ ఎంపీల్లో వేడి పుట్టింది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై వారు ఆందోళ‌న‌కు దిగారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న అంశం ఎక్క‌డా లేదంటూ కేంద్ర‌మంత్రి వెంక‌య్య వ్యాఖ్య‌లు చేసిన 24 గంట‌ల‌కు కానీ.. ఏపీ ఎంపీలు ఆందోళ‌న చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైకోర్టును విభ‌జించాలంటూ తెలంగాణ ఎంపీలు చేసిన ఆందోళ‌న స్ఫూర్తితో ఏపీ ఎంపీలు గురువారం పార్ల‌మెంటు వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

పార్ల‌మెంటు గాంధీ విగ్రహం వ‌ద్ద ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నినాదాలు చేస్తూ ఏపీ ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టారు. జేసీ దివాక‌ర్‌రెడ్డి.. నిమ్మ‌ల కృష్ణ‌ప్ప‌.. తోట న‌ర‌సింహం.. రామ్మోహ‌న్ నాయుడు త‌దిత‌రులు.. పార్ల‌మెంటు వాయిదా ప‌డిన త‌ర్వాత పార్ల‌మెంటు ప్ర‌వేశ ద్వారం నుంచి గాంధీ విగ్రహం వ‌ర‌కూ ఆందోళ‌న నిర్వ‌హించారు.

విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీతో పాటు.. విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్ష‌న్ 8ను అమ‌లు చేయాలంటూ నిర‌స‌న‌కు దిగారు. మొత్తంగా చూస్తే.. పెద్ద‌గా చురుకు ప్ర‌ద‌ర్శించ‌ని ఏపీ ఎంపీలు.. ఎట్ట‌కేల‌కు నిర‌స‌న‌ల్లోకి దిగారు.