Begin typing your search above and press return to search.

తెలంగాణ మునిసిపోల్స్ లో ఏపీ ఎంపీ ఓటు...ఎవరాయన?

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:23 AM GMT
తెలంగాణ మునిసిపోల్స్ లో ఏపీ ఎంపీ ఓటు...ఎవరాయన?
X
ఈ వార్త నిజంగానే సంచలనమని చెప్పక తప్పదు. ఎందకంటే... ఆంధ్రోళ్ల పాలన మాకొద్దంటూ తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన మునిసిపల్ ఎన్నికల్లో.. అదే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ ఎంపీ ఓటు హక్కు వినియోగించుకున్నారట. ఇదేదో ఏ అనామకుడో చెప్పిన మాట కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ పోరులో భాగంగానే ఈ అంశం వెలుగు చూసింది. సరే... లక్ష్మణ్ ఆరోపించారంటే అది నిజమే అయ్యి ఉంటుంది కదా. మరి తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఆ ఎంపీ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సరే మరి... వైరల్ గా మారిన ఈ విషయం ఎలా బయటకు వచ్చిందన్న విషయానికి వస్తే... ప్రజా తీర్పుకు విరుద్ధంగా కొన్ని చోట్ల బీజేపీ... తన సైద్ధాంతిక శత్రువు కాంగ్రెస్ తో జట్టు కట్టిందని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ - మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. నిత్యం పోట్లాడుకునే బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎలా ముందుకెళతాయని ప్రశ్నించిన కేటీఆర్... అదేదో బహిరంగంగా ఆ రెండు పార్టీలు కలిసిపోవచ్చు కదా అని తనదైన శైలి ఆరోపణలు గుప్పించారు. ఈ కామెంట్లను తిప్పికొట్టేందుకు ఎంట్రీ ఇచ్చిన లక్ష్మణ్... టీఆర్ ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టిన అధికార పార్టీ కండబలాన్ని కూడా ప్రయోగించిందని విమర్శలు గుప్పించారు.

అంతటితో ఆగని లక్ష్మణ్... తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఏపీకి చెందిన ఓ ఎంపీ ఓటు హక్కును వినియోగించుకున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇందుకేనా మనం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్నది అని కూడా లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్ల చేతిలో అన్యాయానికి గురయ్యామని చెప్పుకున్న టీఆర్ ఎస్... ఆ వాదనతోనే కదా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపింది... మరి ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ ఎంపీతో తెలంగాణ ఎన్నికల్లో ఓటు ఎలా వేయించారు? అని ఆయన ప్రశ్నించారు. అయితే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీ ఎంపీ ఓటేశారని చెప్పిన లక్ష్మణ్ కూడా... ఆ ఎంపీ ఎవరన్న విషయాన్ని బయటపెట్టలేదు. దీంతో ఇంత పెద్ద దుమారం రేపిన సదరు ఎంపీ ఎవరన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.