Begin typing your search above and press return to search.

తెలంగాణ బాటలోనే ఏపీ నేతల జీతాలు

By:  Tupaki Desk   |   23 March 2016 6:19 AM GMT
తెలంగాణ బాటలోనే ఏపీ నేతల జీతాలు
X
రాష్ట్ర విభజన పుణ్యమా అని పేరుకు రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా.. ఒక తెలుగు రాష్ట్రంలో ఏదైనా ఆసక్తికర నిర్ణయం తీసుకుంటే.. దాని ప్రభావం మరో రాష్ట్రం మీద ఉండటం కనిపిస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల జీతాభత్యాల్ని భారీగా పెంచాలన్న విషయంపై తెలంగాణ సర్కారు సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరి.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల జీతభత్యాలు పెరిగితే.. ఏపీ ప్రజాప్రతినిధులు ఊరుకుంటారా? అందుకే.. ఏపీలోనూ నేతల జీతభత్యాల్ని పెంచాలన్న నిర్ణయం దిశగా బాబు సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జీతాల పెంపు పెద్దగా లేకున్నా.. అలవెన్స్ ల రూపంలో భారీ పెంపు దిశగా అడుగులు వేస్తున్నారు. విభజన కారణంగా పీకల్లోతు అప్పులున్నప్పటికీ.. ప్రజాప్రతినిధుల జీతాల పెంపు విషయంలో మాత్రం తెలంగాణతో పోటీ పడేలా వెనువెంటనే నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

అయితే.. తెలంగాణ సర్కారు స్థాయిలో కాకున్నా.. పెంపు విషయంలో ఏపీ సర్కారు కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల వేతనాల్ని పెంచకుండా.. వారికిచ్చే అలెవెన్స్ లుపెంచాలన్న ఉద్దేశంలో బాబు సర్కారు ఉంది. ఇప్పుడున్న అలెవెన్స్ కు అదనంగా మరో రూ.లక్ష వరకూ పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను త్వరలో అసెంబ్లీలో పెట్టి అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.